ధర్పల్లి, డిసెంబర్ 17: రుణమాఫీ చేయకుండా సర్కారు మోసం చేసింది.. పంట రుణం కింద వడ్ల డబ్బులు కొట్టేసుకుని బ్యాంకు చేతులు దులుపేసుకుంది. ఏం చేయాలో, ఎవరిని నిందించాలో తెలియక ఓ రైతు కుటుంబం దిగాలు చెందుతున్నది. రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ సర్కారు దమన నీతికి అద్దం పట్టే ఈ ఉదంతం నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం చల్లగరిగెలో చోటు చేసుకుంది. రైతు దంపతులు ఎం.రాజేశ్వర్, గంగాజమునకు ధర్పల్లిలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో జాయింట్ అకౌంట్ ఉంది. గతంలో గంగాజమున రూ.75 వేల పంట రుణం తీసుకున్నారు. అయితే, పంట రుణాలు చెల్లించొద్దని, తమ ప్రభుత్వం రాగానే మాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ నేతలంతా హామీలు గుప్పించడంతో రాజేశ్వర్ దంపతులు ఆ రుణం సంగతి మరిచిపోయారు.
అయితే, ఇటీవల వడ్లు విక్రయించగా, ఈ నెల 5న రాజేశ్వర్,గంగాజమున జాయింట్ అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయి. ఇదే అదనుగా తమ పంట రుణాన్ని వసూలు చేసుకోవాలనుకున్న ఐవోబీ బ్యాంక్ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఈ నెల 11వ తేదీన జాయింట్ అకౌంట్ నుంచి రూ.1,06,265 కట్ చేసుకున్నారు. తర్వాతి రోజు గంగాజమున డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లగా, ఖాతాలో డబ్బులు తక్కువగా ఉండడం చూసి ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె తన సోదరుడికి చెప్పగా, అతడు వెళ్లి బ్యాంకులో ఆరా తీశాడు.
పంట రుణం కింద కట్ చేసుకున్నట్లు వారు బదులిచ్చారు. మొండి బకాయి ఉండడంతో ఆటోమెటిక్‌గా డబ్బులు కట్ అయ్యాయని బ్యాంక్ మేనేజర్ చెప్పారు. ఖాతాదారులకు చెప్పకుండా, ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఎలా తీసుకుంటారని ప్రశ్నించగా, అసహనానికి గురైన బ్యాంక్ అధికారులు తాము చేసేదేమీ లేదని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకొండని దబాయించారని బాధితులు ‘నమస్తే తెలంగాణ’తో వాపోయారు. ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా తమను మోసం చేసిందని, పంట అమ్మగా వచ్చిన డబ్బులు కాస్త బ్యాంకులో రుణం కింద పట్టుకుంటే తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు, ఈ వ్యవహారంపై బ్యాంకు మేనేజర్ రాజును వివరణ కోరగా.. పంట రుణం మొండి బకాయి కింద పడిందని, వారికి రెన్యూవల్ చేసుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. డబ్బులు తప్పక పట్టుకోవాల్సి వచ్చిందన్న ఆయన.. మళ్లీ కొత్తగా రుణం ఇస్తామని చెప్పారు. అయితే నోటీసులు ఇవ్వకుండా డబ్బులు కట్ చేస్తారని ప్రశ్నిస్తే, నోటీసులు సైతం పంపామని, వాటికి సంబంధించిన వివరాలు వెతుకుతున్నామని చెప్పారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ చేశామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నది. రైతులను రుణ విముక్తుల్ని చేశామని ఝాటా మాటలు చెప్పుకుంటున్నది. దేశంలో ఎవరూ చేయనట్లు తామే చేశామని చాటింపు వేయిస్తున్నది. కానీ క్షేత్ర స్థాయిలో చూస్తే సగం మందికి కూడా రుణమాఫీ కాలేదన్న విషయం వెలుగు చూస్తున్నది. అందుకు గంగాజమున ఉదంతమే తాజా ఉదాహరణ. రూ.2 లక్షలలోపు రుణమాఫీ దేవుడెరుగు.. సదరు మహిళా రైతు తీసుకున్న రూ.75 వేల రుణాన్ని కూడా మాఫీ చేయకుండా ఎగ్గొట్టిన వైనం సర్కారు దమననీతికి చక్కటి నిదర్శనం.
ఐవోబీలోని జాయింట్ అకౌంట్లో వడ్ల డబ్బులు జమ అయ్యాయి. నా భార్య పేరిట ఉన్న పంట రుణం కింద డబ్బులు కట్ చేసుకున్నారు. కనీసం మాకు సమాచారం ఇవ్వలేదు. ఎలాంటి నోటీసు కూడా ఇవ్వలేదు. మాకు రుణమాఫీ అయితదని చెప్పినా వినకుండా బలవంతంగా డబ్బులు పట్టుకోవడం అన్యాయం. ఇదేందని అడిగితే మేనేజర్ దబాయిస్తున్నారు.
– రాజేశ్వర్, రైతు, చల్లగరిగె