నిజామాబాద్, మే 1 నమస్తే తెలంగాణ ప్రతినిధి : కొంతకాలంగా అధికార కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. అదుగో మంత్రి వర్గ విస్తరణ..ఇదిగో ప్రమాణస్వీకారం..అంటూ వార్తలు వినిపించడంతో పార్టీలోని కీలక నేతలు, ప్రజాప్రతినిధులు ఆశల పల్లకీలో తేలియాడారు. కానీ అవన్నీ వట్టి మాటలే అని తేలడంతో ఏడాదిన్నరగా మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు, క్యాబినెట్ బెర్త్ కోసం పోటీపడుతున్న మాజీ ప్రజాప్రతినిధులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. మొన్నటి వరకూ పదవులు ఇవ్వాలంటూ సాగిల పడిన నేతలంతా ఇప్పుడేకంగా ఎవరికో ఒకరికి ఇవ్వండంటూ విన్నవిస్తున్నట్లు సమాచారం. రోజురోజుకూ మంత్రి వర్గ విస్తరణ ఆలస్యమవుతుండడం.. పదవులపై ఆశలు పెట్టుకున్నవారిలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రగిలిస్తున్నది.
మంత్రి వర్గంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరికీ చోటులేకపోవడంతో ప్రభుత్వపరంగా సంప్రదింపులు, పైరవీలు చేయడానికి పలువురు నేతలకు అడ్డుపుల్లలా మారింది. పక్క జిల్లాలకు చెందిన నేతలతో పైరవీలు చేయించుకుని, సచివాలయంలో అడుగు పెట్టాల్సిన దుస్థి తి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణ చీటికి మాటికి వాయిదా పడడం, రోజుకో విధంగా సామాజిక సమీకరణాలు మారుతుండడంతో ఇప్పట్లో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా? ఉండదా? అనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది.
మరోవైపు ద్వితీయ శ్రేణి నేతలు సైతం పార్టీ అధిష్టానం తీరుపై మండిపడుతున్నట్లు సమాచారం. పదవులు ఇస్తామని చెప్పి, ఏడాదిన్నర దాటినా ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై గుర్రుమంటున్నట్లు తెలిసింది. కనీసం పార్టీ పరమైన పదవుల్లోనైనా చోటు కల్పించాలంటూ పలువురు వేడుకుంటున్నట్లుగా సమాచారం. ప్రభుత్వంతోపాటు పార్టీలోనూ పదవుల పందెరం ఇప్పట్లో ముగిసేలా కనిపించకపోవడంతో హస్తం నేతలంతా నిట్టూరుస్తున్నారు.
ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలకు సంకట స్థితి ఏర్పడింది.రేసులో నేనున్నానంటూ ముందుకురాగా.. ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేల అనుచరులు పాదయాత్రలు చేపట్టారు. ఆందోళనలు చేశారు. విన్నపాలు అందిస్తున్నారు. టీవీ సీరియల్ కన్నా ఎక్కువ ఉత్కంఠ, ఆసక్తి మంత్రివర్గ విస్తరణ విషయంలో చోటుచేసుకున్నది.
డెడ్లైన్లు మారుతున్నప్పటి నుంచి, మంచి రోజులు గడిచి పోతున్నప్పటికీ ముహూర్తం మాత్రం ఖాయం కాకపోడంపై అసంతృప్తికి గురవుతున్నారు. ఒక దశలో పార్టీ అధిష్టానంపైనే సొంత నేతలే విసుక్కుంటున్నారు. బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో భూపతి రెడ్డి గతంలో ఎమ్మెల్సీగా పని చేసిన అనుభవం ఉన్నప్పటికీ, ఇప్పుడు తొలిసారి శాసనసభలో అడుగు పెట్టారు. ఇక బోధన్ నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లా నుంచి ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.
ఏఐసీసీతో ఉన్న సత్సంబంధాలను ఉపయోగించుకుని వీరు కూడా మంత్రి వర్గ రేసులో ఉండడంతో సీనియర్లు సైతం తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతున్నది. తనకు ఇవ్వకున్నా ఫర్వాలేదు కానీ, మొదటి సారి గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇస్తే ఊరుకునేది లేదన్నట్లు సీనియర్ నేత ఒకరు ఏఐసీసీ పెద్దలకు కబురు పంపినట్లు సమాచారం.ఇలా మంత్రివర్గ కూర్పు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తికి ఆజ్యం పోస్తుండగా మరోవైపు గ్రూపులను పెంచి పోషిస్తున్నది.
మంత్రి పదవిపై ఆశ పడుతున్న వారంతా కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన పార్టీలోని సీనియర్ నేతలు పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన వారితోపాటు ఓడిన వారు సైతం బరిలో నిలిచి పైరవీలు చేసుకుంటున్నారు. మంత్రి వర్గ విస్తరణ ఉగాది నాటికి పూర్తవుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్పుకుంటూ వచ్చాయి. ఏఐసీసీ అగ్ర నాయకత్వం సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏప్రిల్ మొదటి వారంలోనే ప్రమాణ స్వీకారం ఉంటుందని అంతా ఆశించారు.
కానీ మంత్రి వర్గ కూర్పు మరోసారి వాయిదా పడడంతో నేతలంతా ఆందోళన చెందుతున్నారు. అసలు పదవులు ఇస్తరా? ఇవ్వరా? అంటూ కీలక నేతలపై గుర్రుమంటున్నట్లు తెలిసింది. సామాజిక సమీకరణల నేపథ్యంలో వాయిదాల పర్వం కొనసాగుతున్నప్పటికీ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఏ నేతను మంత్రి పదవి వరిస్తుందోననే ఆసక్తి నెలకొన్నది. మొదటి నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తనకే మంత్రి పదవి వస్తుందని ఆశిస్తుండగా, అది నెరవేరడం ఇప్పట్లో కష్టమేనని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణపై జాప్యం నెలకొనడంతో పదవి కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండడం గమనార్హం.