ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 21 : కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు పసుపు రైతులను దగా చేశాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు ఉపయోగపడని పసుపు బోర్డు ఎందుకని ప్రశ్నించారు. కేంద్రం జిల్లాలో తూతూ మంత్రంగా బోర్డు ఏర్పాటు చేసిందని, ఎంఎస్పీ లేని బోర్డు గుండు సన్నాతో సమానమని పేర్కొన్నారు. పసుపునకు రూ.12వేలు మద్దతు ధర ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మండిపడ్డారు.
జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేముల మాట్లాడారు. ఒకప్పుడు పుట్టి పసుపు (రెండు క్వింటాళ్లు) అమ్మితే తులం బంగారం వచ్చేదని అన్నా రు. రైతుకు ఇతర పంటలు నష్టం చేసినా పసుపు పంట ఆదుకునేదని తెలిపారు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం, మార్కెట్ అధికారులు, జిల్లా మార్కెట్ కమిటీ దళారులతో కుమ్మక్కై రైతులను నిండా ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే క్వింటాలుకు రూ.12వేలు మద్దతు ధర ఇస్తామని కాంగ్రెస్, నామమాత్రపు ఎంఎస్పీ లేని పసుపు బోర్డు ఏర్పా టు చేసి కేంద్రం.. రైతులను మో సం చేశాయని మండిపడ్డారు. అనివార్యమైన పరిస్థితుల్లో జిల్లా రైతులు తుట్టికి పావుషేరుకు పసుపు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
మార్కెట్ పాలకవర్గం, అధికారులు, దళారులు కుమ్మక్కు కావడంతో ఈ సీజన్లో పసుపు క్వింటాలుకు రూ.13 వేల నుంచి రూ.పదివేలకు పడిపోయిందన్నారు. రైతుల ఒత్తిడితో రూ.10 వేలు కొమ్ముకు, రూ.9 వేలు మండకు కటాఫ్ నిర్ణయించారన్నారు. కొంత పసుపునకు రూ.10వేలు ఇ చ్చి, మిగతా రైతుల నుంచి కొనుగోలు చేస్తలేరన్నారు. దీం తో సదరు రైతులను దిక్కుతోచకుండా చేసి, వారి నుంచి రూ.8వేలకు మాత్రమే కొనుగోలు చేసి ముంచుతున్నారని మండిపడ్డారు. ఈ సిండికేట్ కుట్రలో పాలకవర్గం కూడా ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారని తెలిపారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో పసుపు బోర్డు ఐదు రోజుల్లో తెస్తానని చెప్పి ఎంపీ అర్వింద్ మోసం చేశారని వేముల అన్నారు. నామమాత్రపు బోర్డు తెచ్చారని పేర్కొన్నారు. పసుపు బోర్డు లేనప్పుడే రూ.18 వేలు ధర వస్తే, బోర్డు వచ్చిన తర్వాత పసుపు ధర రూ.10వేలకు తగ్గిందన్నారు. క్షీరాభిషేకాలు చేయించుకున్న ఎంపీ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఎంపీ, ప్రధాని మాటలు నమ్మి ఓటేసిన రైతులను మోసం చేయడం భావ్యం కాదన్నారు. పసుపు బోర్డు వస్తే రైతుకు మద్దతు ధర రాలేదని, కానీ పల్లె గంగారెడ్డికి మాత్రం పదవి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఎంపీ అర్వింద్, బోర్డు చైర్మన్పల్లె గంగారెడ్డి ప్రధానిని కలిసి రూ.15 వేల మద్దతు ధర ఇచ్చే బోర్డు కావాలని డిమాండ్ చేయాలని సూచించారు. ఇదే పసుపునకు సాంగ్లిలో రూ.13,800 ధర ఎలా వస్తుందని, నిజామాబాద్‌లో ఎందుకు రావడంలేదని ప్రశ్నించారు. సాంగ్లి, నిజామాబాద్ మార్కెట్లను అనుసంధానం చేయాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. ప్రభుత్వమే కేంద్రాలను ఏర్పాటు చేసి పసుపునకు రూ.15వేలు ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మార్కెట్ యార్డులో పసుపు క్రయ, విక్రయాలపై కలెక్టర్ విచారణ చేయించాలని కోరారు. పసుపు ధర క్వింటాలుకు రూ.10 వేలు ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదని, ప్రతి కుప్ప ఈ వేలంలో కొనేలా చూసే బాధ్య త కలెక్టర్‌పై ఉందన్నారు. పాలకవర్గం దళారులతో కుమ్మ క్కై రైతులను మోసం చేస్తే తాము ఊరుకోబోమని, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరా టం చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్వింటాలుకు రూ. 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చి, మోసం చేసిందన్నారు.