కామారెడ్డి, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీల నీచ రాజకీయం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. రెండు పార్టీలు ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా వ్యవహరిస్తుండడాన్ని చూసి జనం విస్తుపోతున్నారు. దేశ రాజధానిలోనేమో కాంగ్రెస్, బీజేపీ నాయకులు పరస్పరం తలపడుతున్నట్లు కటింగ్ ఇస్తారు. అదే క్షేత్ర స్థాయికి వచ్చేసరికి కలిసి కదం తొక్కుతారు. బాన్సువాడలో సోమ, మంగళవారాల్లో చోటు చేసుకున్న పరిణామాలే ఇందుకు మంచి ఉదాహరణ. అటు ప్రభుత్వానికి, ఇటు స్పీకర్ పోచారం కుటుంబానికి ఏమాత్రం సంబంధం లేని అంశాలపై రెండు పార్టీల నాయకులు కలిసి నిరసన చేపట్టడం చూసి జనం నవ్వుకున్నారు. కాంగ్రెస్, కాషాయ దళం కలిసి చేస్తున్న కంపు రాజకీయాలపై దుమ్మెత్తిపోస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీలోనేమో కొట్టుకుంటున్నట్టు నటిస్తారు. గల్లీలో మాత్రం ‘చేతి’లో చెయ్యేసుకొని తిరుగుతుంటారు. సిద్ధాంతాలను వదిలి, సిగ్గుమాలిన రాజకీయాలకు పాల్పడుతున్న తీరుపై జనం దుమ్మెత్తిపోస్తున్నారు. కాషాయదళం, కాంగ్రెస్ కలిసిపోయిన తీరును చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. అటు ప్రభుత్వాన్ని, ఇటు స్పీకర్ పోచారం కుటుంబాన్ని బద్నాం చేసేందుకు రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామాను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. బాన్సువాడలో రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూసి కాంగ్రెస్, బీజేపీలను ఈసడించుకుంటున్నారు.
అక్కడ అలా.. ఇక్కడ ఇలా..
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ నాయకత్వం 38 పార్టీలతో ‘ఇండియా’ పేరిట కొత్త కూటమిని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌ను ఖతం చేస్తామని బీజేపీ ప్రగల్భాలు పలుకుతుంటుంది. రాష్ట్రంలోనూ ఇరు పార్టీల నేతలు కొట్టుకుంటున్నట్లే ఊగిపోతుంటారు. కానీ తెర వెనక మాత్రం కథ వేరేలా ఉంటుంది. అందుకు నిదర్శనమే రెండ్రోజులుగా బాన్సువాడలో జరుగుతున్న పరిణామాలు. బాన్సువాడ నియోజకవర్గాన్ని టాప్‌టెన్ నియోజకవర్గాల్లో ఒకటిగా మార్చి, వేల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారు. ఇది గిట్టని ఆ రెండు పార్టీల నాయకులు ఏకమయ్యారు. పార్టీ సిద్ధాంతాలను వదిలి స్పీకర్‌పై బురద జల్లడమే ధ్యేయంగా కనీస విలువలను పాటించకుండా కాంగ్రెస్, బీజేపీ నేతలు డ్రామాలాడుతున్నారు.
నిబంధనల ప్రకారం రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారిపై, మున్సిపల్ అధికారులపై లేనిపోని ఆరోపణలు చేస్తూ, దీనికి కారణం స్పీకర్ కుటుంబం అంటూ కాంగ్రెస్, బీజేపీ ఆందోళనలు చేయడం విస్మయాన్ని కలిగిస్తున్నది. సభాపతి పోచారం నేతృత్వంలో బాన్సువాడ పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. విశాలమైన రోడ్లు, పార్కులు, దవాఖానలు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి జీవనం సాగిస్తున్నారు. వారి అవసరాలకు అనుగుణంగా ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పట్టణం చుట్టుపక్కల రియల్ఎస్టేట్ వ్యాపారులు లే అవుట్లు చేసి ప్లాట్లను విక్రయిస్తున్నారు. దీంతో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. రాష్ట్ర స్థాయిలో టౌన్ ప్లానింగ్ అధికారులు నిబంధనల ప్రకారం లే అవుట్లు జారీ చేస్తుండగా, అక్రమాలు జరుగుతున్నాయంటూ ఇరు పార్టీల నాయకులు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. మున్సిపల్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఓ వ్యక్తికి బీఆర్ఎస్తో సంబంధం లేకున్నా, అధికార పార్టీపై కాంగ్రెస్, కాషాయ నేతలు విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సంబంధం లేని అంశాల్లోకి లాగుతూ..
బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారో వారికే అర్థం కావట్లేదు. కేవలం ప్రభుత్వాన్ని, స్పీకర్‌ను బద్నాం చేయడమే లక్ష్యంగా నిరసనలు చేపడుతున్నారు. సోమవారం బాన్సువాడ దవాఖాన వద్ద జరిగిన ఘటనకు, ప్రభుత్వానికి, స్పీకర్ కుటుంబానికి సంబంధమే లేదు. ఇక, మున్సిపాలిటీలో జరిగినట్లు చెబుతున్న ఫోర్జరీ వ్యవహారంలోనూ బీఆర్ఎస్ పాత్ర అసలే లేదు. అంబులెన్స్ డ్రైవర్ డబ్బులు ఎక్కువగా అడిగాడని, అనామక వ్యక్తి ఫోర్జరీ చేశాడని పేర్కొంటూ స్పీకర్ కుటుంబానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయడం కాంగ్రెస్, బీజేపీ నాయకులకే చెల్లింది. నియోజకవర్గ అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన కుటుంబంపై ఆరోపణలు చేస్తూ, ఈ రెండు పార్టీల నాయకులు చేస్తున్న కుట్రలపై నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. సిద్ధాంతాలను పక్కనపెట్టి, రెండు పార్టీల జెండాలను పట్టుకుని చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుండడాన్ని చూసి జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వీళ్లేనా మైకుల ముందు కొట్లాడుకునేది? అని ముక్కున వేలేసుకుంటున్నారు.