Somarpet | ఎల్లారెడ్డి రూరల్ : ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేసి, ఓటు వేయలేదనే కారణంతో గెలిచిన సర్పంచ్ తమ్ముడు ట్రాక్టర్ను ప్రజల మీదికి ఎక్కించడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఆదివారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో సోమార్పేట్ సర్పంచ్ గా కురుమ పాపయ్య విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన పటేల్ చెరువు మైసమ్మ గుడి వద్ద దావత్ చేయడానికి తన తమ్ముడైన కురుమ పాపయ్యను పొలం వద్దనున్న ట్రాక్టర్ ను తీసుకురమ్మని పంపించాడు.

పొలం నుండి కురుమ చిరంజీవి ట్రాక్టర్ను తీసుకువచ్చే క్రమంలో సర్పంచ్ అభ్యర్థిగా ఓడిన రాజు ఇంటి ముందు నుంచి తీసుకువస్తున్నాడు. రాజు ఇంటి ముందు ఓదార్చడానికి వచ్చిన గ్రామస్తులు పెద్ద ఎత్తున గుమ్మిగుడి ఉన్నారు. అదే సమయంలో వస్తున్న కురుమ చిరంజీవి ఆ ట్రాక్టర్ను ప్రజల మీదికి తీసుకెళ్లాడు. దీంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్కు మెరుగైన చికిత్స నిమిత్తం తరలించారు. మిగతా ముగ్గురికి ఎల్లారెడ్డి ఆసుపత్రిలో చేర్పించారు. హైదరాబాద్ రిఫర్ చేసిన వారిలోని గంజి భారతి నడుము వెన్నుపూసకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఐదుగురికి గాయాలు కావడంతో కోపాదిక్తులైన గ్రామస్తులు మూగుమ్మడిగా కురుమ పాపయ్య ఇంటి పైకి దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని శాంతింప చేశారు. అనంతరం మాలయం రామాలయం ఎదురుగా ప్రధాన రహదారిపై బైఠాయించిన సోమార్పేట్ గ్రామస్తులు భారీ ఎత్తున నిరసన నినాదాలు చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. డీఎస్పీ శ్రీనివాసరావు సీఐ రాజిరెడ్డి, ఎస్సై బొజ్జ మహేష్ కామారెడ్డి, లింగంపేట్ నుండి వచ్చిన పోలీసు సిబ్బందితో కలిసి ఎటువంటి గొడవలు కాకుండా బందోబస్తు నిర్వహించారు. సర్పంచ్ గా ఓడిన అభ్యర్థి అయిన రాజుకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు పలకడంతో రాస్తారోకో వద్దకు బీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో చేరుకున్నారు.