నిజామాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఉడా)ల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై గందరగోళం నెలకొంది. ఇప్పటికే ఉన్న నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) పరిధిని ప్రభుత్వం భారీగా పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో కామారెడ్డికి కొత్తగా కామారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా)ను ఏర్పాటు చేస్తూ 3 మున్సిపాలిటీలు, 460 గ్రామాలను దాని పరిధిలోకి చేర్చింది.
అక్టోబర్ 15నే గవర్నర్ పేరిట గెజిట్ నోటిఫికేషన్ సైతం విడుదల కాగా, ఈ సమాచారాన్ని ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. అయితే, ప్రజాభిప్రాయాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడం, రహస్యంగా ఉత్తర్వులు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు నుడా పరిధి పెంపు, కుడా ఏర్పాటు వల్ల సామాన్య ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఏమిటన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ఇదంతా పదవులు, అధికారాల కోసమా.. లేక మరేదైనా మర్మమున్నదా? అన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నుడా, కుడాకు పాలకవర్గాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ నిరుద్యోగులకు వాటిలో చోటు కల్పించడానికే ప్రభుత్వ తాజా నిర్ణయాలని చెబుతున్నారు.
అభివృద్ధి పేరిట నుడా పరిధిని భారీగా విస్తరించారు. హెచ్ఎండీఏ మాదిరిగానే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు పని చేస్తాయంటూ ఉత్తర్వుల్లో పేర్కొంటూ పాత నుడాను జిల్లా అంతటికీ వర్తించేలా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కేసీఆర్ హయాంలో పురుడు పోసుకున్న నుడా పరిధిలో 75 వరకు గ్రామాల పరిధి ఉండేది. నిజామాబాద్ కార్పొరేషన్తో పాటుగా నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల్లోని కొంత భాగం నుడాలో కలిపారు.
కానీ ఇప్పుడు దాదాపుగా నిజామాబాద్ జిల్లాలోని 6 నియోజకవర్గాలను నుడా పరిధిలోకి తెచ్చారు. కొత్త గెజిట్ నోటిఫికేషన్లో ఆర్మూర్, భీమ్గల్, బోధన్ మున్సిపాలిటీల పరిధిని, 380 గ్రామాలను నుడా కిందకు తీసుకొచ్చారు. కామారెడ్డిలో కొత్తగా ఏర్పాటైన కామారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) సైతం దాదాపుగా జిల్లా మొత్తానికి వర్తించేలా ఉంది. ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి మున్సిపాలిటీలను, 460 గ్రామాలను అందులో చేర్చారు. పెరుగుతున్న పట్టణీకరణలో భాగంగా ప్రజలకు మెరుగైన వసతుల కల్పన, మౌలిక సదుపాయాల వృద్ధిలో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నది.
ప్రస్తుతం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు డెలిగేషన్ పవర్స్ లేవు. కలెక్టర్ ద్వారానే వెంచర్ల అనుమతులు జారీ చేస్తున్నారు. మరోవైపు ఆదాయం సైతం నేరుగా డీటీసీపీకి ఆన్లైన్లోనే బదిలీ అవుతుంది. కొద్ది కాలానికి ఆయా ప్రాంతాలను అనుసరించి ఆదాయాన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు బదిలీ చేస్తున్నారు.
నుడా, కుడా పరిధులను విస్తృతం చేయడం ద్వారా ఆదాయ పంపిణీలో పారదర్శకత కనిపిస్తుందా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. జీపీలు, బల్దియాల పరిస్థితి ఏమవుతుందన్నది చర్చనీయాంశమైంది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు డెలిగేషన్ పవర్స్ సంక్రమిస్తేనే వీటికి అర్థం ఉంటుందన్న వాదన కూడా వినిపిస్తుంది. ఒకవేళా అధికారాలను కట్టబెడితే ఎమ్మెల్యేలు అడ్డుకునే అవకాశాలు లేకపోలేదు. జిల్లా భౌగోళిక స్వరూపంలో 90 శాతానికి విస్తరించిన నుడా, కుడా పరిధితో పాలకవర్గాలకు పెత్తనం చెలాయించే అవకాశం దక్కుతుందా.. లేదా? అన్నది అనుమానంగా ఉంది.