హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో కోశాధికారి ఎన్నిక పూర్తయ్యింది. ఆదివారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఎన్నికలో కోశాధికారిగా అనిల్‌కుమార్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి హరినారాయణరావుపై రెండు ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. పోలింగ్‌లో మొత్తం 175 మంది ఓటర్లకు గాను 153 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇందులో అనిల్‌కుమార్‌కు 61 ఓట్లు, హరినారాయణరావుకు 59 ఓట్లు రాగా, ఆగంరావుకు 27 ఓట్లు, బాబురావుకు 6 ఓట్లు పోల్ అయ్యాయి. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఎన్నికల అధికారి వీఎస్ సంపత్ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. కార్యదర్శి పదవికి ఏకగీవ్రంగా ఎన్నికైన మన్నె జీవన్‌రెడ్డితో పాటు కోశాధికారి అనిల్‌కుమార్‌కు ఆయన ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఇదిలా ఉంటే గతంలో కార్యదర్శి, కోశాధికారిగా దేవరాజ్, సీజే శ్రీనివాసరావు పదవీకాలం ముగియడంతో రెండు స్థానాల కోసం ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.