కాంగ్రెస్ చెప్పిన మార్పు పాలనలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఓవైపు సరిపడా యూరియా లేక రైతాంగం అల్లాడుతున్నది. మరోవైపు, పంచాయతీలకు నిధులు లేక పల్లెల్లో పాలన ఆగమవుతున్నది. సర్కారు నుంచి నిధులు రాకపోవడంతో ఆదాయం కోసం పంచాయతీ సిబ్బంది ప్రజలపై పడుతున్నారు. ఎడాపెడా పన్నుల భారం మోపుతున్నారు. చివరకు మిషన్ భగీరథ నీళ్లకూ టాక్స్లు వసూలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రతి ఇంటికీ ఉచితంగానే సురక్షిత నీళ్లు అందించారు. కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చాక పన్ను విధిస్తుండడంపై పల్లె ప్రజలు మండిపడుతున్నారు. ‘కేసీఆర్ సారు ఉన్నప్పుడే మంచిగుండె.. కావాల్సినన్ని నీళ్లు ఫ్రీగా ఇచ్చేటోళ్లు. గిప్పుడేమో పన్నులు వసూలు జేత్తుండ్రు. కాంగ్రెస్ను నమ్మినందుకు మంచిగనే బుద్ది చెప్పిండ్రని’ వాపోతున్నారు.
-లింగంపేట(తాడ్వాయి), జూలై 1
పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్ల సమస్య ఉండొద్దని తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తలంచారు. ఏ మహిళ కూడా బిందెలు పట్టుకుని పొలాలు, బోర్ల వద్దకు వెళ్లొద్దని, ఇంటికే పైపులైన్ ద్వారా తాగునీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మక మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం రూ.వేల కోట్లు వెచ్చించి లక్షల కిలోమీటర్ల మేర పైపులైన్లు వేశారు. ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకుల నిర్మాణంతో పాటు ప్రతి ఇంటికీ పైపులైన్ వేసి ఉచితంగా తాగునీటిని సరఫరా చేశారు. దీంతో రాష్ట్రంలో తాగునీటి సమ స్యే లేకుండా పోయింది. మిషన్ భగీరథతో సురక్షిత మంచినీటి పథకాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ ప్రభుత్వం.. ఉచితంగానే ఇంటింటికీ సరఫరా చేసింది. అదే సమయంలో దశాబ్దాలుగా ప్రజలపై విధిస్తున్న నీటి పన్ను భారాన్ని తొలగించింది. మిషన్ భగీరథ పథకం ప్రారంభమైన నాటి నుంచి తాగునీటిని ఉచితంగానే సరఫరా చేసింది. దీంతో అప్పటి నుంచి గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు కేవలం ఇంటి పన్నులు మాత్రమే వసూలు చేశారు.
నీటి పన్ను విధించడంపై కృష్ణాజీవాడి పంచాయతీ కార్యదర్శి చంద్రకళను వివరణ కోరగా.. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం వల్ల పంచాయతీ నిర్వహణ భారం పెరిగిందని తెలిపారు. తాగునీటి సరఫరా పన్ను వసూలు చేయడం వల్ల నిర్వహణ పనులు చేయవచ్చని, అందుకే పన్నులు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. భగీరథ నీరు రాని సమయంలో బోర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని, రెండు నెలల వ్యవధిలోనే ఐదుసార్లు మోటార్లు కాలిపోయాయన్నారు. గతంలో విధులు నిర్వహించిన పంచాయతీ కార్యదర్శులు ఇంటి పన్నులతో పాటు నీటి పన్నులు వసూలు చేశారని, ఆ ప్రక్రియనే తాను కొనసాగిస్తున్నానని వివరించారు. నీటి పన్నులు వసూలు చేయవద్దని ఎలాంటి సర్క్యులరూ లేదని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు లేవు. గ్రామాల్లో పంచాయతీ నిర్వహణ భారం పెరుగుతున్నందున.. గ్రామసభలు నిర్వహించి తీర్మానం చేసిన పంచాయతీల్లో పన్నులు వసూలు చేస్తున్నారు. నిధుల కొరత కారణంగా నీటి పన్నులు వసూలు చేసి చిన్నచిన్న మరమ్మతులు చేసుకుంటున్నారు.
– ప్రశాంత్, ఏఈ, తాడ్వాయి.
మిషన్ భగీరథ నీటికి పన్నులు వసూలు చేయాలని కానీ, చేయవద్దని కానీ మాకు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలూ లేవు. గ్రామాల్లో నీటి పన్నులు వసూలు చేస్తున్న మాట నిజమే. ఇలా వసూలు చేసిన డబ్బుతో తాగునీటి సమస్య పరిష్కరించడంతో పాటు పారిశుధ్య పనులు, విద్యుత్ బిల్లులు చెల్లించడానికి వినియోగిస్తున్నారు.
– మలహరి, ఎంపీవో, లింగంపేట
నిధులు లేక పాలన కూనరిల్లుతుండడంతో పంచాయతీ కార్యదర్శులు పనులు చేపట్టడానికి అవస్థలు పడుతున్నారు. మోటార్ల నిర్వహణ, తాగునీటి పైప్లైన్లు, పారిశుద్ధ్య పనులు, క్లోరినేషన్ వంటి నిర్వహణ భారం పంచాయతీ కార్యదర్శులపై పడింది. ఈ నేపథ్యంలో అధికారులు ఆదాయం పెంచుకోవడంపై దృష్టి పెట్టారు. పంచాయతీలకు ప్రధాన ఆదా య వనరుగా ఉన్న ఇంటి పన్నులతో పా టు తాగునీటి పన్నులు సైతం వసూలు చేస్తున్నారు. తాడ్వాయి, లింగంపేట మండలాల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఇంటి పన్నుల వసూలుతో పాటు తాగునీటి పన్నులు సైతం వసూలు చేస్తుండడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాడ్వాయి మండలం కృష్ణాజీవాడికి చెందిన గుజ్జ చిన్న రాజయ్యకు రూ.827 ఇంటి పన్ను, రూ.3 వేల నీటి పన్ను విధించడం స్థానికులను విస్మయానికి గురి చేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పరిస్థితి మారిపోయింది. పల్లెల్లో పాలన కుంటుపడింది. గ్రామపంచాయతీల పాలకవర్గాల గడువు ముగిసి ఏడాది దాటిపోయినా ఎన్నికలు నిర్వహించట్లేదు. దీంతో పంచాయతీలకు వచ్చే 14వ ఆర్థిక సంఘం నిధులు నిలిచి పోయాయి. మరోవైపు, పంచాయతీలకు నేరుగా ప్రభుత్వం నుంచి చిల్లి గవ్వా రావడం లేదు. అటు నిధులు రాక, ఇటు పనులు చేయలేక పంచాయతీ కార్యదర్శులు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్న అధికారులు.. ప్రజలను బాదుతున్నారు.