నవీపేట, మార్చి 1: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి భార్యతో పాటు అత్త, మామపై దాడి చేశాడు. నవీపేట్ మండలంలో శనివారం చోటు చేసుకున్న కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. ఎస్సై వినయ్ కథనం ప్రకారం.. నవీపేట మండల కేంద్రంలోని లింగం గుట్టకు చెందిన మిథున్, అభంగపట్నం గ్రామానికి చెందిన జ్యోతి గతంలో ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. అయితే, సంసార జీవితంలో మనస్పర్థలు రావడంతో జ్యోతి మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది.
ఈ నేపథ్యంలో ఆమె కుటుంబంపై మిథున్ కక్ష పెంచుకున్నాడు. శనివారం పని మీద నవీపేటకు వచ్చిన మామ మహారాజుపై తాగిన మైకంలో బండరాయితో దాడి చేశాడు. గాయపడిన మహారాజును స్థానికులు నవీపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. విషయం తెలిసి జ్యోతితో పాటు ఆమె తల్లి శోభ దవాఖానకు చేరుకున్నారు. అప్పటికి అక్కడే ఉన్న అల్లుడిని ఎందుకు దాడి చేశావని అత్త నిలదీయడంతో కోపోద్రిక్తుడైన మిథున్ తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. భార్య అడ్డుపడగా ఆమెపైనా దాడి చేసి గాయపరిచాడు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కామారెడ్డి, మార్చి 1: భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైన ఘటన కామారెడ్డి పట్టణంలో శనివారం చోటుచేసుకున్నది. వేద మంత్రాల సాక్షిగా ఏడడుగులు నడి చి.. కలకాలం కలిసి ఉంటానని బాస చేసి న భర్తే.. ఆమె పాలిట యముడయ్యాడు. పట్టపగలే భార్యను దారుణంగా పొడిచి హత్యచేశాడు. అనంతరం తానూ పొడుచుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌర స్తా ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మోసారపు మహేశ్వరి(45), నర్సింహులు దంపతులు కామారెడ్డి పట్టణంలోని ఆర్బీనగర్లో నివసిస్తున్నారు.
మహేశ్వరి ఓ హోటల్లో పనిచేస్తుండగా.. నర్సింహులు నిజాంసాగర్ చౌరస్తాలోని సులభ్ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్నాడు. కాగా ఇరువురి మధ్య డబ్బుల విషయంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. శనివారం కూడా దంపతుల మధ్య డబ్బుల విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో క్షణికావేశంలో నర్సింహులు తన వెంట తెచ్చుకున్న కత్తితో భార్యను విచక్షణా రహితంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రామైన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.
అనంతరం అదే కత్తితో నర్సింహులు కడుపులో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఘటనా స్థలాన్ని ఏఎస్పీ చైతన్యారెడ్డి, పట్టణ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి పరిశీలించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మున్సిపల్ శానిటరీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మహేశ్వరి మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ దవాఖానలోని మార్చురీకి తరలించామన్నారు.