నిజాంసాగర్ కింద నాన్కమాండింగ్ ఏరియాకు నీరందివ్వడమే లక్ష్యంగా నిర్మించబోతున్న సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులను బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించనున్నారు. రిజర్వాయర్ ద్వారా 20 గ్రామాల్లోని సుమారు 10వేల ఎకరాల భూములకు సాగునీరు అందనున్నది. రిజర్వాయర్ పరిధిలో అత్యధికంగా గిరిజన తండాలుండడం విశేషం. శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవ్వనున్నారు. శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లను స్పీకర్ మంగళవారం పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేటీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లుచేశాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని ప్రధాన రహదారుల వెంట స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీస్‌శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నది.
-నిజామాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిజామాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్నారు. వర్ని మండలంలోని సిద్ధాపూర్ వద్ద నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్‌కు బుధవారం శంకుస్థాపన చేయబోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ప్రాంతంలో రిజర్వాయర్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలోకి రాని ఏరియాల్లో సాగునీటి గోసను తీర్చేందుకు స్పీకర్ పోచారం ప్రత్యేకంగా శ్రద్ధ వహించారు. ఇందులో భాగంగా స్థానికంగా చిన్నపాటి మూడు చెరువులను కలిపి రిజర్వాయర్‌గా నిర్మించబోతున్నారు. మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సైతం కార్యక్రమానికి హాజరవ్వబోతున్నారు. రిజర్వాయర్ నిర్మాణంతో స్థానికంగా 20 గ్రామాలకు సాగు నీటి గోస తీరబోతున్నది. ఇందులో అత్యధికంగా గిరిజన తండాలుండడం గమనార్హం. సిద్ధాపూర్ రిజర్వాయర్‌గా నామకరణం చేసిన ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 10వేల ఎకరాలకు సాగు నీరు అందించనున్నారు.
సరిగ్గా రెండున్నరేండ్ల తర్వాత రాష్ట్ర మంత్రి కేటీఆర్ బాన్సువాడ నియోజకవర్గానికి వస్తున్నారు. 2019లో బాన్సువాడ పట్టణంలో చేపట్టిన పలు పురపాలక అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు కేటీఆర్ స్వయంగా వచ్చారు. స్పీకర్ అభ్యర్థనతో బాన్సువాడ పుర వీధుల్లో కలియ తిరిగారు. అభివృద్ధిని పరిశీలిస్తూ పలు హామీలు సైతం ఇచ్చారు. రూ.100 కోట్లతో చేపట్టిన పనులను అట్టహాసంగా ప్రారంభించారు. 2021, నవంబర్ 9న కామారెడ్డి జిల్లా బీబీపేట మండలానికి, కామారెడ్డి పట్టణంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. తదనంతరం తాజాగా బుధవారం నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. కేటీఆర్ రాక సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా పరిధిలోని ప్రధాన రహదారుల వెంట కేటీఆర్‌కు వెల్కమ్ బోర్డులు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నుంచి వర్ని, వర్ని నుంచి బాన్సువాడ మార్గాలన్నీ గులాబీమయమయ్యాయి. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీస్ శాఖ పటిష్టవంతంగా ఏర్పాట్లు చేసింది. భారీ బందోబస్తును కల్పిస్తున్నది.
వర్ని మండలం సిద్ధాపూర్ అటవీ ప్రాంతంలో చద్మల్, పైడిమల్, నామ్కల్ అనే మూడు చిన్నపాటి చెరువులు ఉన్నాయి. వీటి పరిధిలో కేవలం 614 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతున్నది. యాసంగిలో పంటలు సాగు చేయడం కష్టతరంగా మారింది. ఏడాది పొడవునా సాగుకు సౌకర్యం లేకపోవడంతో స్థానికంగా గాంధారి, బాన్సువాడ, వర్ని మండలాల్లోని 20 గ్రామాల్లో రైతులు పొలాలను బీడుగా వదిలేస్తున్నారు. ఈ సమస్యను గుర్తించిన స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమయ్యారు. మూడు చెరువులను కలిపి నీటి నిల్వ సామర్థ్యాన్ని దాదాపుగా 409.56 ఎంసీఎఫ్‌టీకి తీసుకెళ్లడం, ఆనకట్టను 3.6కిలోమీటర్ల మేర నిర్మించడం ద్వారా రిజర్వాయర్‌గా మార్చబోతున్నారు. దిగువ పంట పొలాలకు కెనాల్ సిస్టమ్ ద్వారా నీటి సౌకర్యానికి ఏర్పాట్లు చేస్తుండడంతో సమీపంలోని 20 గ్రామాల్లో ఏడాది పొడవునా సాగుకు నీళ్లు లభించే ఆస్కారం ఏర్పడుతున్నది. దాదాపు 10వేల ఎకరాలకు సాగు నీటి సౌకర్యం సిద్ధాపూర్ రిజర్వాయర్‌తో సాకారం కాబోతుండడం విశేషం. రూ.119.41కోట్లలో రిజర్వాయర్ పనులకు రూ.72.52 కోట్లు, గ్రావిటీ ద్వారా కెనాల్స్ నిర్మాణం కోసం రూ.46.89 కోట్లను వెచ్చించబోతున్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలో దాదాపు రెండు గంటల పాటు కేటీఆర్ పర్యటన ఉండనున్నట్లు తెలుస్తున్నది. ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి నేరుగా సిద్ధాపూర్‌కు చేరుకునే అవకాశాలున్నాయి. లేదంటే రోడ్డు మార్గంలోనూ తగు ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం చేసింది. సిద్ధ్దాపూర్లో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సభా స్థలి పక్కనే హెలీప్యాడ్‌ను తీర్చిదిద్దారు. హైదరాబాద్ నుంచి మంత్రి కేటీఆర్‌తో జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు సైతం వచ్చే అవకాశాలున్నట్లుగా తెలుస్తున్నది. గిరిజన రైతులకు మేలు చేసేందుకు రూ.119.41కోట్ల నిధులతో నిర్మిస్తున్న సిద్ధాపూర్ రిజర్వాయర్‌తో స్థానికులకు ఎంతో మేలు చేకూరబోతున్నది. దశాబ్దాలుగా పంటలు పండించేందుకు గోస పడుతున్న గిరిజనులకు స్పీకర్ ఎనలేని మేలు చేస్తున్నారు. సాగు నీటి సౌకర్యం కోసం పోచారం శ్రీనివాస రెడ్డి ప్రతిపాదించిన రిజర్వాయర్‌కు సీఎం కేసీఆర్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇందుకు కృతజ్ఞతగా స్థానికంగా బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. హెలికాప్టర్ ద్వారా సిద్ధాపూర్‌కు వచ్చే క్రమంలో రిజర్వాయర్ పరిసరాలను మంత్రి కేటీఆర్ ఏరియల్ సర్వే చేపట్టనున్నారు.
సిద్ధాపూర్ రిజర్వాయర్ శంకుస్థాపనకు విచ్చేయబోతున్న మంత్రి కేటీఆర్ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సిద్ధాపూర్లో నిర్వహించే బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. రిజర్వాయర్ ద్వారా లబ్ధి పొందే గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున సభకు స్వచ్ఛందంగా తరలిరాబోతున్నారు. కేటీఆర్‌కు ఘనంగా స్వాగతం చెప్పేందుకు బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు సైతం భారీగా రానున్నారు.
– పోచారం భాస్కర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్
రెండున్నర గంటలపాటు మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇరు జిల్లాల పోలీసుల భారీ బందోబస్తు