మాచారెడ్డి, మే 22 : కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. వెంటనే ధాన్యాన్ని లారీల్లో రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని కామారెడ్డి-సిరిసిల్ల ప్రధాన రహదారిపై శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేసి పదిహేను రోజులు గడుస్తున్నా అలాట్మెంట్ చేసిన రైస్ మిల్లులకు తరలించడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎండవేడిమికి ధాన్యం బస్తాలు బరువు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్ భిక్షపతి, ఎస్సై అనిల్, సొసైటీ సీఈవో చంద్రారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొన్నారు. రైతులను సముదాయించారు. వెంటనే లారీలను కేటాయించి ధాన్యం బస్తాలను రైస్‌మిల్లులకు తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని అధికారులకు విన్నవించారు.