నాగిరెడ్డిపేట, ఆగస్టు 20: నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌తో మంజీరా పరీవాహక ప్రాంతంలో నీట మునిగిన పంటలకు ప్రభుత్వం ఎకరానికి రూ.50వేల పరిహారం అందించాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. నాగిరెడ్డిపేట మండలంలోని వెంకంపల్లి, తాండూర్, మాసన్పల్లి, నాగిరెడ్డిపేట శివారులో నీట మునిగిన పంటలను ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి బుధవారం పరిశీలించారు. బురదలో నడుచుకుంటూ వెళ్లి పంటలను చూసి, స్థానిక రైతులతో మాట్లాడారు.
నాలుగు రోజులుగా మూడు ఫీట్ల లోతులో పంటలు నీట మునిగి ఉన్నాయని రైతులు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌తో మండలంలోని 12 గ్రామాల్లో రెండు వేల ఎకరాలకు పైగా పంటలు నాలుగు రోజులుగా నీటిలో మునిగిపోయాయన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు.
గతంలో బీఆర్ఎస్ పాలనలో ఇంతుకు రెట్టింపుస్థాయిలో వరద వచ్చినా.. 24గంటల్లో నీరు దిగువకు వెళ్లేలా చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోకుండా.. రాజకీయాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సన్నాలకు రూ.ఐదు వందల బోనస్ ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్రతాప్‌రెడ్డి, గుర్రా ల సిద్ధయ్య, జలంధర్‌రెడ్డి, ఇమ్రాన్, సతీశ్, వెంకట్‌రెడ్డి, దుర్గారెడ్డి, సంతోష్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్, వంశీగౌడ్, జమాకర్రెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి ఉన్నారు.