కంఠేశ్వర్, ఆగస్టు 11: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి పలువురు జిల్లాస్థాయి అధికారులు డుమ్మా కొట్టడంతో ఆయన అసహనం వ్యక్తంచేశారు. ప్రజావాణిలో భాగంగా కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి పలువురు జిల్లాస్థాయి అధికారులు రాకపోవడాన్ని గమనించిన కలెక్టర్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ప్రజావాణి కార్యక్రమ ప్రాముఖ్యతను అధికారులు గుర్తించాలని, కార్యక్రమానికి కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని పంపించవద్దన్నారు. జి
ల్లా స్థాయి అధికారులే స్వయంగా పాల్గొనాలని స్పష్టం చేశారు. ప్రతి సోమవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించే ప్రజావాణిలో అధికారులు కచ్చితంగా పాల్గొనాలని, ఎవరికైనా అత్యవసర పరిస్థితులుంటే ముందుగా తెలియజేయాలని సూచించారు. అనుమతి లేకుండా ప్రజావాణికి గైర్హాజరైతే కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు. ప్రజావాణిలో జిల్లా అధికారుల హాజరును పరిశీలించేందుకు అటెండెన్స్ తీసుకోవాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చిన 83 ఫిర్యాదులు పరిశీలించి త్వరగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్, నగరపాలకసంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్, డీపీవో శ్రీనివాస్‌రావు, మెప్మా పీడీ రాజేందర్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.