నందిపేట్, నవంబర్ 22: వానకాలం-2024 సంబంధించి కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. డిసెంబర్ మొదటి వారం లోపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. మండల కేంద్రంతో పాటు డొంకేశ్వర్ గ్రామంలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు.
కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, ధాన్యం నిల్వలను పరిశీలించారు. కాంటా సందర్భంగా ఒక్కో బస్తాలో ఎంత ధాన్యం తూకం చేస్తున్నారు.. బస్తాలపై కొనుగోలు కేంద్రం వివరాలు, ధాన్యం రకం తదితర వివరాలను పొందుపరుస్తున్నారా లేదా అనే విషయాలను గమనించారు. రైస్‌మిల్లుల వద్ద తరుగు పేరిట ఏమైనా కోతలు విధిస్తున్నారా అని ఆరా తీయగా, ఈ సీజన్లో ఇప్పటివరకు ఎక్కడ కూడా ఎలాంటి కోతలు అమలు చేయడం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిరీక్షించకుండా క్రమపద్ధతిలో ధాన్యం బస్తాలను తూకం వేయించాలని, ఆన్లైన్లో ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ నిర్వాహకులను ఆదేశించారు.
సన్న ధాన్యానికి సంబంధించి సంపూర్ణ వంటి రకాలను సైతం మండల వ్యవసాయాధికారి ధ్రువీకరణతో ఫైన్ వెరైటీ కింద కొనుగోలు చేయవచ్చని సూచించారు. నిర్ణీత గడువులోపు రైతులకు బిల్లుల చెల్లింపులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరుపుతున్నామని, సన్నాలకు రూ.500 చొప్పున బోనస్ డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయని వివరించారు. ఎంపీడీవో కార్యాలయంలో సర్వే వివరాల ఆన్లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్ ఆనంద్‌కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్‌రావు, సొసైటీ చైర్మన్ మీసాల సుదర్శన్ ఉన్నారు.