ముప్కాల్, సెప్టెంబర్ 29: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించేలా అన్ని వసతులతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.
మెండోరా మండలం పోచంపాడ్‌లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలను శనివారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి రాత్రి గురుకులంలోనే బసచేశారు. ఆదివారం ఉదయం విద్యార్థుల రోల్-కాల్‌ను పరిశీలించారు. విద్యార్థుల కోసం తెచ్చిన పాలు, కూరగాయాల నాణ్యతను పరిశీలించారు. ఖోఖో ఆడేందుకు సిద్ధమైన విద్యార్థులను కలెక్టర్ పరిచయం చేసుకుని వారి ఆటను ఆసక్తిగా తిలకించారు.
విద్యార్థులకు పలు సదుపాయాలు లేకపోవడాన్ని గమనించి, సంబంధిత రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడారు. వాటిని సమకూర్చేలా చూస్తానని చెప్పారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నదని, నాణ్యమైన విద్య, పౌష్టికాహారాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు. కలెక్టర్ వెంట పాఠశాల ప్రిన్సిపాల్ సురేందర్, ఉపాధ్యాయులు ఉన్నారు.