కంఠేశ్వర్, మే 1 : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అదనపు బ్యాలెట్ యూనిట్లు జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్‌కు బుధవారం చేరుకున్నాయి. ఈ మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పర్యవేక్షణలో బ్యాలెట్ యూనిట్లను ఈవీఎం గోడౌన్లో భద్రపర్చారు.
కలెక్టర్ ఆధ్వర్యంలో ఈసీఐఎల్ ఇంజినీర్లు బ్యాలెట్ యూనిట్లకు మొదటిదశ పరిశీలన చేపట్టారు. నిజామాబాద్ నియోజకవర్గ స్థానం నుంచి 29 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున పోలింగ్ నిర్వహణ కోసం రెండు బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌కు ఎన్నికల సంఘం హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ నుంచి అదనంగా వెయ్యి బ్యాలెట్ యూనిట్లను కేటాయించింది.
ర్యాండమైజేషన్ నిర్వహించిన తర్వాత బ్యాలెట్ యూనిట్లను పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.