ఖలీల్‌వాడి, డిసెంబర్ 23 : ప్రభుత్వం కొనసాగిస్తున్న వివిధ కార్యక్రమాలను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని, ఈ నెలాఖరు నాటికి నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. లక్ష్యసాధనలో అలసత్వం ప్రదర్శించే వారిపై వేటు తప్పదని హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మన ఊరు – మన బడి, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ, క్రీడా ప్రాంగణాలు, హరితహారం, పల్లెప్రకృతి, బృహత్ పల్లెప్రకృతి వనాలు, పారిశుద్ధ్యం నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. మొదటి విడతలో గుర్తించిన 114 పాఠశాల్లో మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులను పూర్తిచేయాలన్నారు. రూ. 30 లక్షలకు పైబడి విలువ కలిగిన పనులకు వారం రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు.
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద మంజూరు తెలిపిన 325 పాఠశాలల్లో పనులన్నీ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీలో పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ మరింత ప్రగతి సాధించాల్సిన అవసరముందన్నారు. ఈనెలాఖరులోగా అన్ని క్లస్టర్ల పరిధిలో 75 శాతం లక్ష్యాన్ని సాధించాలని గడువు విధించారు. జిల్లాలోని మొత్తం 530 గ్రామ పంచాయతీల పరిధిలోనూ తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు కావాలని అన్నారు. బృహత్ ప్రకృతివనాలు, నర్సరీల నిర్వహణను మెరుగుపర్చుకోవాలని, అన్ని నర్సరీల్లో మొక్కల పెంపకానికి వీలుగా బ్యాగ్స్ ఫిల్లింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. లేకపోతే ఏపీవోలను బాధ్యులుగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్క సంరక్షణకు చర్యలు చేపట్టాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో చందర్, డీపీవో జయసుధ, మెప్మా పీడీ రాములు, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్‌రావు, జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్, కార్మికశాఖ అధికారి యోహాన్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు దేవిదాస్, భావన్న, మురళి పాల్గొన్నారు.