కామారెడ్డి, అక్టోబర్ 18: ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరును హెల్ప్‌లైన్ యాప్ ద్వారా పరిశీలించుకొని తప్పక ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ కోరారు. ఓటు హక్కును పౌరులందరూ తమ నైతిక బాధ్యతగా వినియోగించాలని సందేశమిచ్చేందుకు స్వీప్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ముగ్గుల పోటీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రలోభాలు, డబ్బులు, కానుకలకు లొంగక మనస్సాక్షి మేరకు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని అన్నారు. బలమైన ప్రజాస్వామ్యం అవసరమనే అంశంతో ఓటు ఆవశ్యకత, ఓటు విలువ, ఓటు నా జన్మహక్కు అనే తదితర సందేశాలతో మహిళలు వేసిన ప్రతి ముగ్గునూ కలెక్టర్ తిలకించి వారిని ప్రశంసించారు. రంగోళీలో పాల్గొన్న వారికి ప్రోత్సాహకంగా గిఫ్ట్ బాక్సులు అందజేశారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి శ్రీధర్ రెడ్డి, మండల రిసోర్సు పర్సన్లు, మహిళలు పాల్గొన్నారు.
కౌంటింగ్ హాళ్లలో ఓట్ల లెక్కింపు, ఏజెంట్లు కూర్చునేలా పకడ్బందీగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అధికారులకు సూచించారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు సందర్భంగా బుధవారం ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్ చంద్రమోహన్, సంబంధిత అధికారులతో కలిసి ఎస్పీ కార్యాలయం సమీపంలోని కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కామారెడ్డిలోనే జరుగుతుందని, బాన్సువాడ కౌంటింగ్ హాళ్లలో అవసరమైన టేబుల్స్ ఏర్పాటు చేసేందుకు మార్కింగ్ చేయాలని అధికారులకు సూచించారు. హాల్లోకి ఒక ప్రవేశ ద్వారం ఈవీఎంలు తెచ్చేలా, మరో ప్రవేశ ద్వారం ద్వారా అధికారులు, ఏజెంట్లు, అభ్యర్థులు వచ్చేలా చూడాలన్నారు. ఓట్ల లెక్కింపు వివరాలు ఎప్పటికప్పుడు మీడియాకు తెలిపేందుకు ప్రత్యేక సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ చెక్‌పోస్టుల వద్ద నిఘా ఉంచాలని, ఫ్లయింగ్ స్కాడ్, ఎస్ఎస్టీ బృందాలకు సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లాలోని 125 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మద్యం నిల్వ చేసిన ప్రాంతాలను గుర్తించి స్వాధీనం చేసుకోవాలన్నారు. వారి వెంట ఏఎస్పీ నరసింహారెడ్డి, ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు, మైనార్టీ వెల్ఫేర్ అధికారి దయానంద్ తదితరులు ఉన్నారు.