విద్యానగర్, జనవరి 2 : ‘ప్రజావాణి’లో వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి పరిష్కరించాలని అన్నారు. ప్రజావాణిలో భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వచ్చే ఫిర్యాదులను రెవెన్యూ అధికారులు తక్షణమే పరిష్కారం చూపాలని అన్నారు. రెవెన్యూ 40, సివిల్ సైప్లె ఒకటి, డీఎంహెచ్వో రెండు, డీపీవో ఒకటి, మున్సిపల్ మూడు, డీఆర్డీవో ఐదు, ఎస్పీ కార్యాలయం నాలుగు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఐదు మొత్తం 61 ఫిర్యాధులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఆర్డీవో సాయన్న, ఏవో రవీందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.