కామారెడ్డి, అక్టోబర్ 7: వానకాలం (2024-25)లో సేకరించిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రైస్ మిల్లుల యజమానులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని ఏరోజుకు ఆరోజు మిల్లులకు తరలించాలని సూచించారు.
తరలించిన ధాన్యం వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి, 48 గంటల్లో రైతులకు చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. దొడ్డు, సన్న రకం ధాన్యాన్ని వేర్వేరుగా నిల్వ చేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న సీఎంఆర్ బియ్యాన్ని త్వరగా పూర్తిచేయాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, రైస్ మిల్లుల సంఘం అధ్యక్షుడు పప్పుల రాజేందర్, కార్యదర్శి సంతోష్ కుమార్, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.