కామారెడ్డి, జూలై 30: పంట రుణమాఫీ పథకం ద్వారా జిల్లాలో 74,756 రైతు కుటుంబాలకు సంబంధించిన రూ.442 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు. రెండో విడుత రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన రైతులకు చెక్కులు అందజేశారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. తొలి విడుతలో 49,940 మంది రైతు కుటుంబాలకు 231 కోట్ల మేర లబ్ధి జరిగిందన్నారు. మలి విడుతలో 24,816 మంది రైతు కుటుంబాలకు రూ.211 కోట్లను ప్రభుత్వం వారి ఖాతాలలో జమ చేసిందన్నారు. రుణమాఫీలో ఇబ్బందుల్లేకుండా చూస్తున్నామని, తొలివిడుత మాఫీకి సంబంధించి 1,209 ఫిర్యాదులను రాగా పరిష్కరించామని తెలిపారు.
రైతులకు సమస్యలు ఉంటే 72888 94616,72888 94600కు కాల్ చేసి పరిష్కరించుకోవచ్చని వివరించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ, డీఏవో భాగ్యలక్ష్మి, లీడ్ బ్యాంక్ మేనేజర్ రవికాంత్ పాల్గొన్నారు.