ఖలీల్‌వాడి/నందిపేట్, జూన్ 6 : సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో పాలనను గాలికొదిలేశారని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో పర్సంటేజీల రాజ్యం నడుస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ అంటేనే ఫేక్, ఫాల్స్, ఫ్రాడ్, ఫ్లాప్ అని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అంటే బలహీన వర్గాలు, రైతుల సంక్షేమమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజలను హింసించే భూతాల దేవి అని, ఆ పార్టీకి రాక్షస నీతి తప్ప రాజనీతి లేని కొరివి దెయ్యాల కొంప అని విమర్శించారు.
బీఆర్ఎస్ను దెయ్యాల రాజ్యసమితి అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జీవన్‌రెడ్డి మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీనే జనం దేశ పొలిమేరలు దాటేలా కొడుతున్నా ఢిల్లీలో రాహుల్‌గాంధీకి, గల్లీలో రేవంత్‌రెడ్డికి ఏమాత్రం బుద్ధి రావడం లేదన్నారు. కేసీఆర్ తెలంగాణ సూర్యుడని, బీఆర్ఎస్ అగ్గి పుట్టించే ఉద్యమ భాస్వరమని పేర్కొన్నారు. గులాబీ సైన్యం తెలంగాణ రక్షణ కవచమని, తెలంగాణకు పట్టిన అసలు సిసలైన కొరివి దెయ్యం రేవంత్ అని వివరించారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా నకిలీ సర్టిఫికెట్ల దందా సాగుతున్నదని, ఇందుకు జీహెచ్ఎంసీలో వెలుగు చూసిన ఫేక్ బర్త్, డెత్ సర్టిఫికెట్ల వ్యవహారమే నిదన్శనమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేయడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని మొండి చెయ్యి చూపించారని మండిపడ్డారు. పంటలు కొనకుండా అన్నదాతలను ఆగం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నేతలు బిల్లులు ఇప్పించి 20 శాతం కమీషన్ కొట్టేస్తున్నారని, ఇందిరమ్మ ఇండ్ల పథకం పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు.