బీర్కూర్, ఫిబ్రవరి 27 : తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు మార్చి ఒకటిన సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఆదేశించారు. సోమవారం ఆయన తెలంగాణ తిరుమల కొండపై ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రమోహన్, స్థానిక సంస్థల కలెక్టర్ వెంకటేశ్ దోత్రేతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం తిరుమల కొండపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాక సందర్భంగా అధికారులకు ఇచ్చిన బాధ్యతలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పని చేయాలన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహించాలని సూచించారు. ఎవరూ సెలవు తీసుకోవద్దని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్డీవో రాజాగౌడ్, బీర్కూర్ తహసీల్దార్ రాజు, ఎంపీడీవో భానుప్రకాశ్, ఆయాశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.