స్వరాష్ట్రంలో సంక్షేమ విప్లవం తీసుకొచ్చిన సీఎం కేసీఆర్.. నిరుపేదల కోసం మరో అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టారు. పేదలకు గూడు కల్పించాలన్న లక్ష్యంతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నారు. ఇప్పుడు సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే స్థోమత లేని వారికి కేసీఆర్ అండగా నిలువనున్నారు. ఇందుకోసమే ‘గృహలక్ష్మి’ పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకం ద్వారా పేదల ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. ప్రతి నియోజకవర్గంలో 3 వేల మందిని ఈ పథకానికి ఎంపిక చేయనున్నారు. తద్వారా ఉమ్మడి జిల్లాలో 27 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. గృహలక్ష్మి విధివిధానాలు విడుదల కావడంతో పేదల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
– నిజామాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మరో అద్భుతమైన పథకాన్ని తీసుకువచ్చింది. సొంత స్థలం కలిగి ఉండి ఇంటిని నిర్మించుకోలేని వారికి అండగా నిలిచేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.3 లక్షలు ఆర్థిక సాయాన్ని పూర్తి రాయితీతో అందించే పథకాన్ని అమలు చేయబోతున్నది. ఈ పథకానికి గృహలక్ష్మి పేరును ఖరారు చేయగా.. విధివిధానాలను ప్రభుత్వం రిలీజ్ చేయడంతో సంబంధిత వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి వేలాది మంది పేదలకు పంపిణీ చేసింది. ఇప్పుడు సొంత జాగాలోనే ఇండ్లను నిర్మించుకునే వారిని ప్రభుత్వం ప్రోత్సహించనున్నది. గ్రామాలు, పట్టణాల్లో వర్తించే పథకానికి కలెక్టర్ల నేతృత్వంలోనే ప్రక్రియ అంతా జరుగనున్నది. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి ఆమోదంతోనే లబ్ధిదారుడికి సాయం అందుతుంది. రూ.3 లక్షల సాయాన్ని మూడు దశల్లో లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలోనే జమ చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా గృహలక్ష్మి పథకాన్ని అమలు చేయబోతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 27 వేల మందికి ప్రయోజనం..
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 వేల మందికి ‘గృహలక్ష్మి’ సాయాన్ని అందజేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 27 వేల మందికి ప్రయోజనం చేకూరనున్నది. ఒకవేల ఇంతకన్నా ఎక్కువ మంది దరఖాస్తుదారులు ఉంటే వారికి మరో విడుతలో సాయం చేస్తారు. ప్రజలు, ప్రజా ప్రతినిధుల ద్వారా వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ అధ్యయనం చేసి అర్హులకు ప్రభుత్వ సాయం అందించేలా చర్యలు తీసుకుంటుంది. ఇండ్లు లేని, జాగా కూడా లేని వారికి ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేసింది. ఈ స్కీమ్ ద్వారా గ్రామాలు, పట్టణాల్లో వేల సంఖ్యలో మంజూరు చేసిన డబుల్ బెడ్రూం ఇండ్లతో వేలాది మందికి లబ్ధి చేకూరింది.
లబ్ధిదారుల ఎంపికలో సామాజిక న్యాయం..
గృహలక్ష్మి పథకాన్ని ఆన్లైన్ ఆధారితంగానే అమలు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పర్యవేక్షణలో గృహలక్ష్మి పేరుతో ప్రత్యేకంగా పోర్టల్‌ను తీసుకురానున్నది. మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. జిల్లాల వారీగా ప్రజల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి, అర్హుల జాబితాను కలెక్టర్ నిర్ణయిస్తారు. దశల వారీగా జిల్లాకు చెందిన మంత్రి ఆయా ఇండ్లను మంజూరు చేస్తారు. ఇంటి నిర్మాణ శైలిని లబ్ధిదారుడి ఇష్టపూర్వకంగా ఎలాగైనా కట్టించుకోవచ్చు. ఆధార్‌కార్డు, ఓటరు ఐడీ, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. జీవో నంబర్ 59 ద్వారా లబ్ధిపొందిన వారు, ఆర్సీసీ రూఫ్‌తో ఇల్లు ఉన్న వారిని అనర్హులుగా లెక్కిస్తారు. ప్రతి నియోజకవర్గంలో ఎస్సీలు 20 శాతం, ఎస్టీలు 10 శాతం, బీసీ, మైనార్టీలు కలిపి 50 శాతం ఉండేలా జాగ్రత్త వహించబోతున్నారు.
పేదింటికి ఆర్థిక మద్దతు..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ మేనిఫెస్టోలో సొంతింటి జాగా ఉన్న వారికి పైనాన్షియల్ సపోర్టు కల్పిస్తామని హామీ ఇచ్చింది. రూ.3లక్షల వరకు ప్రభుత్వమే డబ్బులు అందించడం ద్వారా లబ్ధిదారుడు తనకు ఇష్టమైన రీతిలో సొంతింటి నిర్మాణాన్ని చేపట్టుకోవచ్చని బీఆర్ఎస్ పార్టీ హామీల్లో స్పష్టంగా పేర్కొన్నది. ఇచ్చిన హామీలను ఒక్కోటి అమలుచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. సొంతింటి నిర్మాణానికి ఆర్థిక భరోసా కల్పించే పథకాన్ని అమలు చేయబోతున్నది. గ్రామాల్లో చాలా మందికి సొంతింటికి జాగ అందుబాటులో ఉంటుంది. కానీ ఇంటి నిర్మాణం చేపట్టేందుకు రూ.లక్షలు పెట్టుబడి పెట్టే స్తోమత ఉండదు. అలాంటి వారికి సీఎం కేసీఆర్ తీసుకు వచ్చిన గృహలక్ష్మి పథకం ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రభుత్వం కొంత ఆర్థిక చేయూత లభించడం ద్వారా మిగిలిన సొమ్మును లబ్ధిదారుడే కలుపుకొని సొంతింటిని నిర్మించుకునేందుకు అవకాశం లభించనుంది.
పూరి గుడిసెను తొలగించి ఇంటిని నిర్మిస్తా..
మాకు సొంత ఇల్లు లేకపోవడంతో పూరిగుడిసెలో ఉంటున్నాం. డబుల్ బెడ్రూం ఇంటి పథకంలో భాగంగా డబ్బులు వస్తాయన్న ఆశతో నెల రోజుల కిందటే గుడిసెను తొలగించి ఇంటి నిర్మాణం చేస్తామనుకున్నాం. సీఎం కేసీఆర్ సార్ గృహలక్ష్మి పథకం కింద సొంత స్థలం ఉంటే ఇంటిని నిర్మించుకునేందుకు రూ.3 లక్షలు ఇస్తామని చెప్పిండు. దీంతో మాకు చాలా సంతోషంగా ఉంది. గుడిసెను తొలగించి ఇంటిని నిర్మిస్తాం.
– ఎల్లయ్య, వొడ్డెపల్లి
చాలా సంతోషంగా ఉన్నది
ఇంటి నిర్మాణం కోసం రూ. 3 లక్షలు ఇస్తామని సీఎం కేసీఆర్ సార్ ప్రకటించడం చాలా సంతోషంగా ఉన్నది. మాకు ఉన్న చిన్న ఇంటి వద్ద కొంచెం స్థలం ఉన్నది. మా గ్రామంలో అందరూ ఇండ్లు కట్టుకుంటున్నారని ప్రతిరోజూ అనుకునేవాళ్లం. గృహలక్ష్మి పథకం కింద మేముకూడా ఇంటిని నిర్మిస్తామన్న నమ్మకం కలిగింది. మేము త్వరలో ఇంటిని నిర్మించుకుంటాం.
– కన్నెగల్ల లచ్చవ్వ, గోర్గల్
గృహలక్ష్మి పథకంతో ఇబ్బందులు దూరం కానున్నాయి..
గృహలక్ష్మి పథకంతో ఇంటి నిర్మాణ బాధలు దూరం కానున్నాయి. ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇంటిని మంజూరు చేస్తుందంటూ ప్రకటించడంతో చాలా సంతోషించాం. కానీ మాకు అందలేదు. ఇప్పుడు గృహలక్ష్మి పథకంలో భాగంగా నియోజకవర్గానికి మూడు వేల ఇండ్లు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ సార్ నిన్ననే గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం సంతోషంగా ఉన్నది. ఈ పథకం ద్వారా మేము కూడా ఇంటిని నిర్మించుకుంటాం.
– కుమ్మరి గణేశ్, నిజాంసాగర్
సొంతింటి కల నెరవేరనున్నది
చాలా మంది ఇల్లు నిర్మించుకోవాలని అనుకున్నా, అప్పులు అవుతాయన్న భయంతో నిర్మించుకోవడం లేదు. గృహలక్ష్మి పథకం తీసుకురావడం ద్వారా పేదలు సైతం ఇంటిని నిర్మించుకోవచ్చనే నమ్మకం కలిగింది. రూ. 3 లక్షలు నేరుగా లబ్ధిదారుడికే అందనుండడంతో చిన్నగా ఇంటిని నిర్మించుకోవచ్చని పేదలు అనుకుంటున్నారు. కేసీఆర్ సారు తీసుకున్న నిర్ణయంతో పేదల సొంతింటి కల నేరవేరనున్నది.
– గజ్జెల్ జీవన్, బుర్గుల్