డిచ్పల్లి, సెప్టెంబర్ 29 : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గపరిధిలో తండాల్లో రోడ్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.39.12 కోట్లను శుక్రవారం విడుదల చేసింది. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అభ్యర్థన మేరకు సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేశారు. ఇందుకు గిరిజన తండాల పరిధిలో ఈ నిధులతో రోడ్ల నిర్మాణలు చేపట్టాలని గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తూ ఉత్తర్వులు జారీచేశారు. ధర్పల్లి, మోపాల్, సిరికొండ మండలాల పరిధిలోని గిరిజన గ్రామాల్లో మొత్తం 32.65 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి రూ.39.12 కోట్లు విడుదల చేసిందని, ఈ నిధులతో రోడ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని ఆర్అండ్బీ చీఫ్ ఇంజినీర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
నియోజకవర్గ పరిధిలోని సిరికొండ, డిచ్పల్లి మండలం మిట్టాపల్లి తండా నుంచి సట్లాపూర్ తండా వరకు రూ.2 కోట్ల 21 లక్షలు, సిరికొండ మండలంలోని కొటాలోడి తండా, మందుల్ తండా నుంచి సత్రు తండా వరకు, పోత్నూర్ తండాకు, పాత తండా నుంచి హనుమాన్ తండా వరకు రూ. 5 కోట్ల 24 లక్షలు, సిరికొండ మండలం రావుట్ల నుంచి మహిపాల్ తండా వరకు, నర్సింగ్‌పల్లి నుంచి రాంసింగ్ తండా వరకురూ. 4 కోట్ల 37 లక్షలు, ధర్పల్లి మండలంలోని కోటాల్‌పల్లి నుంచి రాజమ్మ తండా, కేకే తండా వడ్డెర కాలనీ – ఇందల్వాయి వరకు రూ. 2 కోట్ల 20 లక్షలు, మోపాల్ మండలం చిన్నాపూర్ నుంచి కులాస్పూర్ తండా వయా పెద్దమ్మ ఆలయం వరకు రూ. 3 కోట్ల 50 లక్షలు, కులాస్పూర్ తండాకు రూ. 2 కోట్లు, మోపాల్ మండలంలోని గాంధీనగర్ తండా వయా మల్లారం శివాలయం, ధర్మారం, సిర్పూర్, మోపాల్, కాల్పోల్, కాల్పోల్ తండా, వడ్డెర కాలనీకి రూ. 7 కోట్ల 60 లక్షలు, ముదక్పల్లి, కులాస్పూర్, బాడ్సి మీదుగా చిన్నాపూర్ వరకు రూ. 12 కోట్లు మంజూరయ్యాయి.