ఉమ్మడి జిల్లాలో గులాబీ జోష్ మిన్నంటింది. ఒకేరోజు ముగ్గురు ముఖ్యమైన నేతలు పర్యటించడంతో ఉభయ జిల్లాల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. సీఎం కేసీఆర్ రాకతో ఉద్యమ గడ్డపై సరికొత్త ఉత్సాహం వెల్లివిరిసింది.. కామారెడ్డి నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న ముఖ్యమంత్రి గురువారం నామినేషన్ వేశారు. అనంతరం స్థానిక డిగ్రీకళాశాల ఆవరణలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు జనం పోటెత్తారు. కామారెడ్డి గడ్డతో పుట్టుక నుంచి తనకున్న అనుబంధం మొదలుకుని ఉద్యమ నేపథ్యం వరకు గత స్మృతులను గుర్తుచేశారు.
అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధిని జిల్లా ఏర్పాటు, మెడికల్ కాలేజీ స్థాపన సహా అనేక అంశాలను వివరించారు. మరోసారి అవకాశమిస్తే కామారెడ్డిని బంగారు తునకగా మారుస్తామని ప్రకటించారు. ఆర్మూర్‌లో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. బోధన్‌లో షకీల్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలను తమ ప్రసంగాలతో ఉత్తేజపరిచారు. ఒకేరోజు ముగ్గురు నేతల రాకతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొన్నది.
కామారెడ్డి పట్టణం జనసంద్రమైంది. గులాబీ జెండాలు, తోరణాలు, కేసీఆర్ కటౌట్లు, స్వాగత ఫ్లెక్సీలతో గులాబీమయమైంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం డిగ్రీ కళాశాల మైదానంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. సభకు కామారెడ్డి పట్టణంతోపాటు నియోజకవర్గంలోని అన్నిమండలాల నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించగా… జనమంతా ఉత్సాహంగా విన్నారు. పదేండ్లలో రాష్ర్టాభివృద్ధి, కామారెడ్డి జిల్లా అభివృద్ధిని గులాబీబాస్ సమగ్రంగా వివరించారు. తాను పోటీ చేయడంతో ఇక్కడి ప్రజానీకానికి జరిగే మేలును తెలపడంతో ప్రజలంతా ఒక్కసారిగా జేజేలు పలికారు. సీఎం కేసీఆర్‌కే మా మద్దతు ఉంటుందని జనమంతా చేతులెత్తి జైకొట్టారు.