జాతీయ రాజకీయ గతిని మార్చేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విద్వేష, విభజన విధానాలను ఎండగట్టే వారే కరువైన తరుణంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి అడుగు ముందుకేశారు. దేశ ప్రయోజనాలు, భావితరాల భవిష్యత్తు కోసం కార్యక్షేత్రంలోకి దిగుతున్నారు. స్తబ్ధుగా, నిస్సత్తువుగా మారిన దేశ రాజకీయాలను ప్రక్షాళన చేసి, బీజేపీ ఆగడాలను అడ్డుకునేందుకు ఢిల్లీ వేదికగా పోరాడనున్నారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన సీఎం కేసీఆర్.. నేడు (బుధవారం) దేశ రాజధానిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ చారిత్రక ఘట్టంలో పాలు పంచుకునేందుకు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. నాలుగు రోజుల క్రితమే ఢిల్లీ వెళ్లిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రారంభోత్సవ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, బిగాల గణేశ్ గుప్తా, హన్మంత్ షిండే, జాజాల సురేందర్, ఎమ్మెల్సీ వీజీగౌడ్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ విఠల్‌రావు, ముఖ్య నేతలు పోచారం సురేందర్‌రెడ్డి, ముజీబు ద్దీన్, దఫేదార్ రాజు తదితరులు మంగళవారం దేశ రాజధానికి చేరుకున్నారు.
నిజామాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించేందుకు సిద్ధమైన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో కీలకమైన అడుగు వేస్తున్నారు. డిసెంబర్ 8న టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెలువరించడంతో జాతీయ రాజకీయ కార్యక్రమాల్లో వేగం పుంజుకున్న ది. ఇందులో భాగంగా డిసెంబర్ 9న భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుక అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు పాల్గొన్నారు. అదే వేదిక నుంచి పార్టీ జెండాను ఆవిష్కరించి స్పష్టమైన ఎజెండాను ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు బయల్దేరిన కేసీఆర్ నేడు దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో శాస్ర్తోక్తంగా ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి నేతలంతా హుషారుగా ఢిల్లీకి బయల్దేరారు.
భాగ్యనగరం నుంచి ఢిల్లీ దాకా…
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పడిన భారత రాష్ట్ర సమితి హైదరాబాద్‌లో 2006లో తెలంగాణ భవనాన్ని నిర్మించుకున్నది. ప్రజల ఆదరాభిమానాలతో 33 జిల్లాల్లోనూ నూతనంగా పార్టీ జిల్లా కార్యాలయాల ఏర్పాటు చేస్తున్నది. ఇదే సమయంలో ఢిల్లీ గడ్డపై స్వాభిమానాన్ని, తెలంగాణ ప్రజల ఆత్మాభిమాన పతాకను ఎగరవేసేందుకు భారత రాష్ట్ర సమితి కార్యాలయం నేడు ఆవిష్కృతం కాబోతున్నది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరుగనున్నది. ఈ గులాబీ పండుగను యావత్ తెలంగాణ సమాజం, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులంతా సంబురంగా జరుపుకోబోతున్నారు. తెలంగాణ అస్తిత్వంతో మొదలైన టీఆర్ఎస్ పార్టీ ఈ మధ్యనే దేశ రాజకీయాల్లో సమూల మార్పులు తెచ్చేందుకు బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి మరో చారిత్రక సందర్భం ఢిల్లీ వేదికగా జరుగనున్నది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా బీఆర్ఎస్ ప్రస్థానం షురూ కాగా ఈ జైత్రయాత్ర మున్ముందు రాకెట్ వేగంతో దూసుకుపోనున్నది.
బీజేపీ నిరంకుశత్వంపై యుద్ధం…
సుదీర్ఘంగా సాగిన తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. ఒక జాతి ఏకతాటిపైకి వచ్చి ఒక రాజకీయ పార్టీని సొంతం చేసుకోవడం ఒక చారిత్రక సన్నివేశమే. నిద్రాణంగా ఉన్న స్వరాష్ట్ర ఆకాంక్షలను ముక్కోటి గొంతుకల్లో మార్మోగించారు. తెలంగాణ యావత్ సమాజాన్ని సమన్వయంతో ఉద్యమ పంథాన నడిపించారు. రాష్ట్ర సాధనలో తెలంగాణ భవన్ నిర్మాణం, తర్వాత దాని పాత్ర అనిర్వచనీయం. అది భావ సారూప్యత కలిగిన ప్రతి ఒక్కరికీ వేదికగా నిలిచింది. ఉద్యమ వ్యూహాలకు పదును పెట్టింది. హైదరాబాద్‌లోని రెండంతస్తుల ఈ ఆత్మాభిమాన ప్రతీక నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల శాశ్వత చిరునామాగా నిలిచింది. బీఆర్ఎస్గా మారిన గులాబీ పార్టీ ఇప్పుడు దేశంలో రాజకీయ మార్పు దిశగా అడుగులు వేస్తున్నది. కేంద్రంలోని నిరంకుశ బీజేపీ ప్రభుత్వ పాలనపై యుద్ధానికి సిద్ధమైంది. రాష్ట్ర సాధకుడు, ఉద్యమనేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సారథ్యంలో దేశమంతా పిడికిలి బిగించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కమలం పార్టీని తుత్తునియలు చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.