కమ్మర్పల్లి, ఫిబ్రవరి 16: ఉద్యమకాలం నుంచి బాల్కొండ నియోజకవర్గంతో ప్రత్యేక అనుబంధమున్న సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక భారీగా అభివృద్ధిని అందించి నియోజకవర్గంపై తన ఆదరాభిమానాలను కొనసాగిస్తున్నారు. దివంగత నేత వేముల సురేందర్ రెడ్డితో ప్రత్యేక అనుబంధం, సురేందర్‌రెడ్డి కుమారుడు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో ప్రేమ, విశ్వాసం సైతం బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధికి దోహదం చేశాయి. ఉద్యమ సమయంలో నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీని సందర్శించిన కేసీఆర్.. ప్రాజెక్టు కట్టమీద కూర్చొని నేతలతో ముచ్చటిస్తూ తెలంగాణలో ప్రాజెక్టులు శివాలయాలైతే ఆంధ్రాలో ప్రాజెక్టులు వైష్ణవాలయాలని పేర్కొంటూ తెలంగాణ సాగు నీటి రంగ అభివృద్ధిపై సీమాంధ్ర పాలకుల వివక్షను ఆవేదనా భరితంగా వర్ణించారు. స్వరాష్ట్రం వచ్చాక ఎస్సారెస్పీని దుస్థితి నుంచి బయట పడేసేందుకు నడుం బిగించారు.
ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీటి లభ్యత నానాటికీ తగ్గి పోతుండడంతో కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని తరలించి ఎస్సారెస్పీని నింపుకొనే పునర్జీవం పథకాన్ని తెచ్చారు.ఈ క్రమంలో ఎస్సారెస్పీ వరద కాలువను రివర్స్ పంపింగ్ ప్రవాహ కాలువగా మార్చి దానిలో మూడు కాలాలూ నీరుండేలా మార్చేశారు. దీంతో ఎల్లప్పుడూ నిండుగా నీళ్లుండే 29 కిలోమీటర్ల పొడవైన మినీ రిజర్వాయర్లా మారింది. రూ.1000 కోట్లతో చేపట్టిన ఎస్సారెస్పీ పునర్జీవ ప్రాజెక్టుకు 2017 ఆగస్టు 10న పోచంపాడ్‌లో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. దీంతో ఎస్సారెస్పీపై ఆధారపడ్డ ఎత్తిపోతల పథకాలు, కాకతీయ కాలువ, లక్ష్మీ ఎత్తిపోతల పథకం, నవాబు, హన్మంత్ రెడ్డి లిఫ్టులకు శాశ్వత నీటి భరోసా కలిగింది. సీఎం కేసీఆర్ ఇక్కడి రైతులపై ప్రేమతో అందించిన మరో వరం ప్యాకేజ్-21. భీమ్‌గల్, వేల్పూర్, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లో మూడు ఎకరాలకు ఒక ఔట్‌లెట్‌తో నేరుగా మడిలోకే నీరందించే ఈ పథకాన్ని గ్రావిటీ ద్వారా కాకుండా పైపులైన్గా మార్చి రైతుల భూములు కోల్పోకుండా కాపాడారు సీఎం కేసీఆర్.
నియోజకవర్గంలో వాగులకు జలకళను అందించి పూర్వవైభవం తేవాలన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంకల్పానికి సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. నియోజకవర్గం నడిమధ్యలో నుంచి 45 కిలోమీటర్లు ప్రవహించే పెద్ద వాగు, కప్పల వాగుపై 24 చెక్డ్యామ్లతోపాటు భీమ్‌గల్ మండలంలో చిన్న వాగు, ఉడిపి వాగుపై మూడు చెక్ డ్యామ్‌లు నిర్మించారు. కేసీఆర్ మానస పుత్రిక హరితహారం కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని 2015 జూలై 6న బాల్కొండ నియోజకవర్గంలోని మంత్రి వేముల స్వగ్రామమైన వేల్పూర్‌లో దివంగత నేత వేముల సురేందర్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి కేసీఆర్ ప్రారంభించారు.
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి అండగా ఉంటూ బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ భరోసా అందిస్తున్నారు. అందుకు రుణపడి ఉంటాం. ఎస్సారెస్పీ పునర్జీవంతో వరద కాలువ నిండుకుండలా ఉంటున్నది. దీంతో రైతులకు గణనీయంగా ప్రయోజనం కలుగుతున్నది. ఇది కేసీఆర్.. బాల్కొండ నియోజకవర్గంపై చూపిస్తున్న ఆదరణకు నిదర్శనం.
-బద్దం రాజేశ్ రెడ్డి, వీడీసీ అధ్యక్షుడు, కమ్మర్పల్లి
బాల్కొండపై కేసీఆర్‌కు ఉన్న ప్రేమను మొదటి నుంచి చూస్తున్నాం. మా పెద్ద సారు సురేందర్‌రెడ్డితోపాటు మా నాయకుడు వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధి కోసం కన్న కలలు మాకు తెలుసు. వాటిని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నెరవేర్చడంలో కేసీఆర్ అండదండలు అందిస్తున్నారు.
-బాల్‌రాజు, మోతె
సదాశివనగర్, ఫిబ్రవరి 16: చెరువుల పునరుద్ధరణ కోసం అమలు చేసిన మిషన్ కాకతీయ పథకానికి కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని పాత చెరువులో సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. 2015 మార్చి 12న రూ.కోటీ24లక్షల నిధులతో పనులు ప్రారంభించారు. మన ఊరు- మన చెరువు పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా చెరువుల్లోని పూడికమట్టిని తొలగించి, రైతుల పొలాలకు తరలించారు. అదేవిధంగా కాలువలు, తూములు, అలుగులు, కట్టల బలోపేతం తదితర పనులను పకడ్బందీగా చేపట్టారు. మండుటెండల్లో కూడా చెరువుల్లో జలాలు ఉండడానికి మిషన్ కాకతీయ పథకమే కారణమని చెప్పవచ్చు. చెరువు కింద ఉన్న ఆయకట్టుకు వానకాలంతోపాటు యాసంగి పంటలకు సాగు నీరందుతున్నది. దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. కేవలం ఒక్క పాత చెరువు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులను పునరుద్ధరించిన పథకానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టడం విశేషం.
గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ అనే అద్భుత పథకాన్ని ప్రవేశపెట్టి.. సదాశివనగర్ పాత చెరువు నుంచే శ్రీకారం చుట్టడంతో మా నియోజకవర్గం చరిత్రలో నిలిచిపోయింది. మిషన్ కాకతీయ ఫలితంగానే ప్రతి గ్రామంలోని చెరువుల కింద రెండు పంటలూ పండుతున్నాయి. రైతులు ఆనందంగా ఉండేందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– జాజాల సురేందర్, ఎమ్మెల్యే, ఎల్లారెడ్డి
సదాశివనగర్ పాత చెరువును పునరుద్ధరించడంతో నిండుకుండలా ఉంటుంది. చెరువులోని నల్లమట్టిని రైతుల పొలాలకు ఉచితంగా తరలించడంతో భూములు సారవంతం అయ్యాయి. దీంతో అధిక దిగుబడులు వచ్చి ఆర్థికంగా ఎదిగారు. సీఎం కేసీఆర్‌కు సదాశివనగర్ మండల ప్రజలు రుణపడి ఉంటారు.
– బొల్లిపెల్లి మహేందర్‌రెడ్డి,
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, సదాశివనగర్
పల్లెల్లో నిర్లక్ష్యానికి గురైన గొలుసుకట్టు చెరువులు సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే బాగుపడ్డాయి. మిషన్ కాకతీయ పథకంలో చేపట్టిన పనులతో చెరువుల్లో పుష్కలంగా నీరు ఉంటుంది. భూగర్భ జలమట్టం పెరిగి చుట్టుపక్కల పొలాల్లో ఉన్న బోరుబావులకు సమృద్ధిగా నీరందుతుంది. అపర భగీరథుడైన సీఎం కేసీఆర్‌కు రైతులంతా రుణపడి ఉంటాం.
– మర్కంటి బుచ్చన్న, బీఆర్ఎస్ కుర్మ సంఘం ఉపాధ్యక్షుడు, మర్కల్