బాన్సువాడ/ఎల్లారెడ్డి, మార్చి 1 : తెలంగాణ కోసం నిరంతరం ఆలోచిస్తూ అభివృద్ధిలో రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన కేసీఆర్ కోసం దేశ ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ తిరుమల తిరుపతి ఆలయం వద్ద బుధవారం నిర్వహించిన సీఎం కృతజ్ఞత సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ ఆశీస్సులతో విడుదలైన రూ. 13 కోట్ల నిధులతో ఆలయ నిర్మాణంతోపాటు భక్తులకు వివిధ సౌకర్యాలు కల్పించామన్నారు. ముఖ్యమంత్రి సహకారం మరువలేనిదన్నారు. అడిగిందే తడవుగా ప్రతిసారీ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి నిధులిచ్చారని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 11 వేల ఇండ్లు కోసం దాదాపు రూ. వెయ్యి కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. తాను జీవించినంత కాలం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని స్పష్టం చేశారు. తాను చాలా మంది ముఖ్యమంత్రులను చూశానని, మాట ఇచ్చిన వెంటనే జీవోలు జారీ చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని వివరించారు. తాజాగా బాన్సువాడలో హెలికాప్టర్ దిగిన తర్వాత వెంకన్న ఆలయానికి 66 ఎకరాల స్థలం కావాలని కోరిన గంటలోనే జీవో వచ్చిందన్నారు.
ప్రజల కోసం ఇంత వేగంగా పనిచేస్తున్న ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదని స్పీకర్ కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిజాంసాగర్ నీటి కోసం సింగూరు నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యేలు నిరాహార దీక్షలు చేసినా స్పందన ఉండేదికాదని, కేసీఆర్ హయాంలో అడిగిన వెంటనే ఎంతంటే అంత నీరు నిజాంసాగర్‌లోకి వచ్చి చేరుతున్నదని గుర్తుచేశారు. గోదావరి నీటిని కాళేశ్వరం ద్వారా 570 మీటర్ల పైకెత్తి తిరిగి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి తీసుకువస్తున్నారని, ఇది తల్లి దగ్గరికి పిల్ల వచ్చే పద్ధతిగా కాకుండా పిల్ల దగ్గరికే తల్లి వచ్చే విధంగా ఉన్నదన్నారు. ఇది కేసీఆర్ ఆలోచన, పనితీరుకు నిదర్శనమని కొనియాడారు. ఇక సాగర్ ఆయకట్టు పంటలకు నీటి కరువు ఉండదని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలోనే రూ. 1600 కోట్ల విలువచేసే పంట పండుతున్నదని చెప్పారు. సాగునీటి కోసం నియోజకవర్గానికి ప్రభుత్వం రూ. 1200 కోట్లు కేటాయించిందని, వీటిలో సిద్ధాపూర్ రిజర్వాయర్‌కు రూ.150 కోట్లు, జాకోర ఎత్తిపోతలకు రూ. 120 కోట్లతోపాటు చందూరు ఎత్తిపోతల పథకానికి నిధులు వచ్చాయని తెలిపారు. నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.300 కోట్లు కేటాయించిందని తన ప్రసంగంలో వివరించారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అభివృద్ధి అంటే ఏమిటో సీఎం కేసీఆర్ చేసి చూపిస్తున్నారని, మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందని రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సీఎం కృతజ్ఞత సభలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. సంక్షేమంతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలు ఆందిస్తున్నారని అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధిచేసి దేశంలోనే అగ్రగామిగా నిలుపుతున్నారని కొనియాడారు.