రైతుల భూములకు ఎసరు పెట్టేందుకు… ప్రశాంతమైన పల్లెల్లో రైతుల మధ్య భూముల చిచ్చు రాజేసేందుకు హస్తం నేతలు ఆరాటపడుతున్నట్లు కనిపిస్తోంది. పదేండ్ల కిందట ఉన్న భూ కబ్జాలు, భూ రికార్డుల మార్పులు, దళారుల రాజ్యాన్ని మళ్లీ తెచ్చేందుకు ఉవ్విళూరుతున్నారు కాంగ్రెసోళ్లు. పొలం పనుల్లో బిజీబిజీగా ఉంటున్న అన్నదాతలను పోలీసు స్టేషన్లు, కోర్టు మెట్లు ఎక్కించి వారి బతుకులను ఆగం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వారి మాటల్లోనే తేటతెల్లమవుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పదేండ్ల పాలనలో రైతులంతా సుభిక్షంగా ఉంటుంటే.. కాంగ్రెసోళ్లకు కన్నుకుట్టినట్లున్నది. రైతుల మధ్య ఉన్న భూ పంచాయితీలను పూర్తిగా పరిష్కరిస్తూ, వారి భూములకు రక్షణగా ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారు సీఎం కేసీఆర్. అత్యంత పారదర్శకంగా సేవలందిస్తున్న ధరణిని తీసివేసి.. మళ్లీ పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకొచ్చి మా మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్న కాంగ్రెస్‌ను ఖతం చేస్తామంటున్నారు అన్నదాతలు. ధరణీ ఉండాలె.. సీఎం కేసీఆరే రావాలె.. అయితేనే మా భూములన్నీ భద్రంగా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.
భూమాత పోర్టల్‌తో భూములకు భద్రత ఉండదు..
సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ పెట్టి రైతులకు ఖర్చు లేకుండా పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారు. కాంగ్రెస్ మళ్లీ ధరణి తీసివేసి భూమాత పోర్టల్ పెడితే రైతులకు నష్టమే. ఇందులో కౌలుదారు, అనుభవదారుల కాలం పెడతామని చెప్పడం సరికాదు. భూమాత పోర్టల్‌తో రైతుల భూములకు భద్రత లేకుండా పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతాంగానికి నష్టం జరిగే పరిస్థితి ఏర్పడుతుంది.
– కొండ అశోక్, రైతు కిసాన్‌నగర్ గ్రామం, బాల్కొండ మండలం
సమస్యలను తీర్చింది ధరణి..
తెలంగాణ ప్రభుత్వం ధరణి తీసుకురావడంతో రైతులకు సంబంధించిన ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యాయి. భూముల విషయంలో గతంలో ఎన్నో తగాదాలు ఏర్పడ్డాయి. అటువంటి పరిస్థితులకు ధరణి పోర్టల్ రాకతో ఫుల్స్టాప్ పడింది. ఏ సమస్య వచ్చినా గతంలో అధికారుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వచ్చేది. చేతులు తడపాల్సి వచ్చేది. అయినా పనులు సరిగా అయ్యేటివి కాదు. ధరణి రాకముందు భూముల విషయంలో చాలా గోల్మాల్ జరిగేది. ధరణితోనే భూముల విషయంలో చాలా రిలీఫ్‌గా ఉన్నారు.
– కుంటగంగారెడ్డి, రైతు, పాలెం
కాంగ్రెసోళ్లు వస్తే మళ్లీ ఆగమే..
తెలంగాణలో కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తే రైతులు ఆగమవుతారు. ధరణి పోర్టల్‌తో దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేదు. అంతా ఆన్లైన్ కావడంతో భూములకు సంబంధించిన సమస్యలు క్షణాల్లోనే తీరుతున్నాయి. ఇలాంటి సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. కాంగ్రెసోళ్లకు అధికారం ఇస్తే ధరణి తీసేసి.. భూ రికార్డులను తారుమారు చేసే పరిస్థితులు తెస్తారు. ఇలాంటోళ్లకు అధికారం ఇచ్చే ప్రసక్తే లేదు. మా మద్దతు సీఎం కేసీఆరేకే..
– కమలేశ్ పటేల్, రైతు, వేల్పూర్
ధరణితో భూముల వివరాలు అద్దంలా కనిపిస్తున్నాయి
సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో రైతులకు సంబంధించిన భూముల వివరాలు అద్దంలా కనిపిస్తున్నాయి. భూముల వివరాల కోసం గతంలో కర్ణాల చుట్టూ తిరిగితిరిగి అలసిపోయే వాళ్లం. ఇప్పుడు అంతా ఆన్లైన్లో చూసుకోవచ్చు. ఇంత సౌకర్యం కల్పించిన కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే మళ్లీ పాతకాలం పద్ధతిలో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ధరణి కొనసాగాల్సిందే.. కేసీఆర్ మళ్లీ సీఎం కావాల్సిందే. మా మద్దతు బీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది.
-భోజన్న యాదవ్, రైతు, వేల్పూర్
భూ తగాదాలు పెరుగుడే..
ధరణిని తీసేస్తా అని మాట్లాడేవాళ్లు పిచ్చోల్లే అని చెప్పవచ్చు. ధరణిని తీసివేస్తే మళ్లీ గ్రామాల్లో భూతగాదాలు మొదలవుతయి. ధరణి ఏర్పాటుతో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయాయి. అంతేగాక భూములు కొన్నా, అమ్మినా నాలుగైదు సార్లు తిరగడం, వ్యయ ప్రయాసాలకోర్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగేది. కానీ ధరణి రాకతో ఎవరి చేతులూ తడపకుండా భూముల రిజిస్ట్రేషన్ నిమిషాల్లో పూర్తవుతుంది. అది కూడా మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయాల్లోనే చేసుకునే అవకాశం దక్కింది.
– వెంకట్రాజ్, రైతు, సుంకెట్
పాత కథలు చాలైతాయి..
ధరణి పోతే మళ్లీ పాతకథలే చాలైతాయి. గదే తిరుగుడు, గదే తినిపిచ్చుడు. సెప్పులరిగే దాంక తిరుగుడూ ఇదే నడుస్తది. ధరణి వచ్చిందంటే ఎప్పుడంటే అప్పు డు మీసేవ కేంద్రాలకు పోయి భూముల లెక్క సూసుకోవచ్చు. ఇంతకు ముందు ఇదంతా ఎక్కడిది. భూముల లెక్క జూడాలంటే చేతులగొన్ని పైసలు వెట్టాలె. రమ్మన్నప్పుడు పోవాలె. దీని వల్ల నరకం జూసినం. ఇగ ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ చేయించుకునుడు కూడా వీజీ అయిపోయింది. ఎమ్మార్వో ఆఫీస్లనే రిజిస్ట్రేషన్ జేసుకునుడు అందరికీ సౌలత్ అయింది.
– నంబుల లింబన్న, రైతు, మోర్తాడ్
ధరణి తీసేస్తే ఊరుకోం
భూముల లొల్లులు దూరంజేసిన ధరణిని తీసేస్తామంటే ఊరుకోం. ఏండ్ల నుంచి ఉన్న లొల్లులు దూరమైనయ్. వోళ్లభూమి ఆళ్లకు ఖాతాలకు వచ్చింది. ఉన్న భూమి గురించి ఎప్పుడంటే అప్పుడు, ఆఫీసర్ల దగ్గరికి పోకుండా సూసుకునే అవకాశం కల్గింది. ఇటువంటి సౌలత్ను గవర్నమెంట్ జేస్తే ఎద్దు ఎవుసం తెల్వనోళ్లు వచ్చి తీసేస్తమంటే ఎట్ల ఊరుకుంటం. సదుకోనోళ్లమే మంచిగున్నదంటున్నం. సదుకున్నోళ్లకేమైంది.. ఇష్టమచ్చినట్లు మాట్లాడుతున్నరు.
– పర్స రాజారెడ్డి, రైతు దోన్పాల్