విద్యానగర్, జనవరి 7: కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ ముసాయిదాపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ విషం చిమ్ముతున్నారని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు. 2000 సంవత్సరంలోనూ మాస్టర్‌ప్లాన్ రూపొందించామని, అప్పుడు ఏ ఒక్క రైతు భూమి కూడా పోలేదని గుర్తు చేశారు. ప్రస్తుత బృహత్ ప్రణాళిక ముసాయిదా వల్ల కూడా ఏ రైతుకూ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. మాస్టర్‌ప్లాన్ భవిష్యత్తులో పట్టణ అభివృద్ధికే అని అన్నారు. శనివారం కామారెడ్డిలోని తన నివాసంలో గంప విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డి మున్సిపల్లో ఏడు గ్రామాలు విలీన కావడంతో పట్టణ విస్తీర్ణం పెరిగిందని, దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల అవసరాల దృష్ట్యా అందరికీ అనుకూలంగా మాస్టర్‌ప్లాన్ డ్రాఫ్ట్‌ను తయారు చేశామన్నారు. 2000 సంవత్సరంలో మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించామని, ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి బృహత్ ప్రణాళికను తయారు చేస్తారని చెప్పారు. వాస్తవానికి 2020లో డ్రాఫ్ట్ రూపొందించాల్సి ఉండగా, కరోనా కారణంగా రెండేళ్లు ఆలస్యమైందన్నారు.
ప్రజల సౌకర్యం కోసమే..
2000 సంవత్సరంలో మాస్టర్ ప్లాన్ తయారు చేసినప్పుడు మొత్తం 3,486 ఎకరాల 18 గుంటలు ఉందని.. 7 విలీన గ్రామాలు కలపడంతో 15 వేల 209 ఎకరాలు అయిందని గంప వివరించారు. ఇప్పుడు తయారు చేసిన మాస్టర్‌ప్లాన్ 2041 వరకు ఉంటుందని, ప్రజల సౌకర్యాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. కామారెడ్డి పట్టణంలో 3,412 ఎకరాల 11 గుంటల ప్రభుత్వ భూమి ఉందని అందులోంచి ఆయా గ్రామాలకు వివిధ అవసరాల కోసం ఇవ్వగా 1,777 ఎకరాల భూమి ఉందని అన్నారు. ఇప్పటి వరకు 365 ఇన్వార్డులు తీసుకోవడం జరిగిందన్నారు. ముందుగా కౌన్సిల్లో పెట్టిన తర్వాతనే ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు ఆయన వివరించారు.
ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మొద్దు..
ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని గంప గోవర్ధన్ సూచించారు. రైతులు సహా ఎవ్వరికీ అన్యాయం జరగనివ్వమని తేల్చిచెప్పారు. ప్రభుత్వ పరం గా ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కామారెడ్డిని జిల్లాగా ప్రకటించి జిల్లా అభివృద్ధ్దికి అనేక రకాల సౌకర్యాలు కల్పించారని అన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు కామారెడ్డి ఎంతో అభివృద్ధి చెందిందని, టేక్రియాల్ నుంచి హౌసింగ్‌బోర్డు వరకు 6 లైన్ల రోడ్డు, నిజాంసాగర్ నుంచి లింగాపూర్ వరకు 4 లైన్ల రో డ్డు విస్తరణ జరిగి పట్టణం ఎంతో సుందరంగా అభివృద్ధి చెందిందన్నారు. ఇప్పటికే కేటీఆర్ మాస్టర్‌ప్లాన్‌పై దిశా నిర్దేశం చేశారని తెలిపారు. దీనిపై ప్రజలు, రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు.భవిష్యత్తులో రైతులతో చర్చించి ఈ మాస్టర్ ప్లాన్ పై అవగాహన కల్పిస్తామని అన్నారు.
ముందే అవగాహన కల్పించాం..
రాష్ట్ర వ్యాప్తంగా 14 మున్సిపాలిటీల మాస్టర్ప్లాన్ల డ్రాఫ్ట్‌లు ప్రభుత్వానికి అందాయని, అందులో కామారెడ్డి మున్సిపాలిటీ కూడా ఉందని గంప తెలిపారు. కౌన్సిల్లో చర్చించి ఒక అవగాహనకు వచ్చాకే తీర్మానం పంపించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా ప్రవేశపెట్టిన తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లో తెలుపాలని పేపర్లలో యాడ్స్ ఇచ్చామని, విలీన గ్రామాలతోపాటు పట్టణాల్లోనూ ఫ్లెక్సీల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. కానీ ప్రతిపక్ష నాయకులు కొందరు కావాలనే రైతులను రెచ్చగొడుతూ వారిలో అపోహలు, భయాందోళనలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇది ముసాయిదా మాత్రమేనని, ఫైనల్ కాదని అందరికీ తెలుసేనన్నారు. అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లో తెలుపాలని చెప్పామని గుర్తు చేశారు. ప్రతిపక్ష నాయకులు రాజకీయం చేస్తున్నారన్నారు.