రెంజల్,ఆగస్టు 25 : గణేష్ ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని బోధన్ రూరల్ సీఐ విజయబాబు సూచించారు. మండలంలోని సాటాపూర్ గ్రామం రైతు వేదికలో సోమవారం పోలీస్ శాఖ తరపున శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఈనెల 20 నుంచి గణేష్ ఉత్సవాలు నేపథ్యంలో మత పెద్దలతో శాంతికి కమిటీ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. గణేష్ ఉత్సవాలు ఎట్టి పరిస్థితుల్లో డీజే లకుఅనుమతి లేదని, భక్తి పాటలను మండపాల వద్ద ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు.
వచ్చే నెలలో గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ రెండు పండుగలను హిందూ, ముస్లింలు సోదర భావంతో మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహించుకోవాలన్నారు. ముఖ్యంగా మండలంలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రశాంతమైన వాతావరణంలో పండుగలునిర్వహించుకునేందుకు ప్రజలు పోలీసులతో సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీవో కమలాకర్. రెంజల్ ఎస్సై కే చంద్రమోహన్, గ్రామ కార్యదర్శి మహబూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.