వినాయక నగర్, డిసెంబర్ 16: నిజామాబాద్ (Nizamabad ) జిల్లా కేంద్రంలో మ్యారేజ్ బ్యూరో (Marriage Bureau) ముసుగులో ఇద్దరు మహిళలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అడ్డదారిలో డబ్బులు సంపాదించేందుకు పసిబిడ్డ విక్రయానికి తెర లేపారు. అమాయకులైన మహిళలను టార్గెట్‌గా చేసుకొని వారికి పుట్టిన బిడ్డను ఇతరులకు విక్రయిస్తే లక్షల్లో డబ్బులు వస్తాయని నచ్చ చెప్పారు. దానికి అంగీకరించిన ఓ మహిళ తన పేగు తెంచుకొని పుట్టిన రెండు నెలల పసిబిడ్డను మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఓ వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుంది. నిజామాబాద్ నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సతీష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
నిజామాబాద్ నగరానికి చెందిన లక్ష్మి అనే మహిళ గతేడాది శ్రీనివాస్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. వీరికి రెండు నెలల క్రితం ఒక బాబు జన్మించాడు. అయితే లక్ష్మికి నగరంలో ఓ మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులులైన మంజుల, రమాదేవి.. లక్ష్మికి స్నేహితులు. పుట్టిన బిడ్డను సంతానం లేని వారికి విక్రయిస్తే లక్షల్లో డబ్బులు వస్తాయని ఆమె గర్భం దాల్చిన నాటి నుంచే చెబుతూ వస్తున్నారు. దానికి అంగీకరించిన లక్ష్మి తనకు పుట్టబోయే బిడ్డను రూ.2.40 లక్షలకు విక్రయించేందుకు బ్యూటీ పార్లర్ ఇరువాకులతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో మంజుల, రమాదేవి.. హైదరాబాద్‌లో మ్యారేజ్ బ్యూరో నిర్వాకుడైన విఠల్, మరో బ్రోకర్ సహాయంతో మహారాష్ట్రలోని పుణెకు చెందిన దంపతులకు బాబును విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. బాబును విక్రయించిన తల్లికి ఒప్పందం ప్రకారం డబ్బులు ఇచ్చారు. మధ్యవర్తులుగా ఉన్న రెండు మ్యారేజ్ బ్యూరోలకు చెందినవారు, బ్రోకర్ ఒక్కొక్కరు రూ.40 వేల వరకు కమిషన్ తీసుకున్నారు.
కాగా, ఈనెల 5వ తేదీన రెండు నెలల బాబును తీసుకొని ఇంట్లోంచి వెళ్లిపోయిన లక్ష్మి.. ఐదు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఆమెతోపాటు బాబు లేకపోవడంతో శ్రీనివాస్ ప్రశ్నించాడు. దీంతో పొంతన లేని సమాధానం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు లక్ష్మీని విచారించగా అసలు విషయం బయటపెట్టింది. దీంతో లక్ష్మీతోపాటు మధ్యవర్తులుగా వ్యవహరించిన రమాదేవి, మంజుల, హైదరాబాద్‌కు చెందిన విటల్, బాబును కొనుగోలు చేసిన పుణెకు చెందిన విశాల్‌పై కేసు నమోదుచేశారు. నిందితుల్లో నలుగురిని రిమాండ్‌కు తరలించారు. మ్యారేజ్ బ్యూరో నిర్వాహకుడు విఠల్ పరారీలో ఉన్నాడని ఎస్హెచ్ఓ సతీశ్ తెలిపారు.