నిజామాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలతో పంటలు దెబ్బతినగా.. పలుచోట్ల కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. పెద్దమొత్తంలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో అధికారం యంత్రాంగం విఫలమవగా.. ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో జాప్యం నెలకొనడం.. రైతులకు శాపంగా మారింది. అకాల వర్షాలతో ఆగమాగమవుతున్న రైతుల ఇబ్బందులను తీర్చడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఫక్తు రాజకీయ కార్యక్రమానికే రేవంత్ హాజరయ్యాడు. ఇప్పుడు కూడా లోక్‌సభ ఎన్నికల్లో భాగంగానే ఇందూరు గడ్డకు వస్తున్నారు. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి తరఫున ఎన్నికల సభలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. అయితే సీఎం రాకకు మూడు రోజుల ముందే నిజామాబాద్ జిల్లాను అకాల వాన ఉక్కిరి బిక్కి రి చేసింది. వందలాది మంది రైతులు, వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తడిపేసింది. కల్లాల్లో తడిసిపోయిన వడ్లను చూస్తూ రైతులంతా బోరుమంటున్నారు. బాధను దిగమింగుకుంటూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తడిసిన ధాన్యాన్ని గతంలో కేసీఆర్ సర్కారు ఎలాంటి షరతులు లేకుండా కనీస మద్దతు ధరకే సేకరించింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు అండగా నిలిచే వారు కరువయ్యారన్న వాదన వినిపిస్తోంది. సీఎం రాక సందర్భంగా తమకు భరోసా కల్పించే ప్రకటనను రేవంత్‌రెడ్డి చేస్తారని జిల్లా రైతాంగం ఆశిస్తున్నది. కానీ ఫక్తూ రాజకీయ ప్రసంగాలకే పరిమితం అవుతున్న సీఎం మాత్రం రైతులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటారా? లేదా? ఎన్నికల కోడ్ పేరిట ముఖం చాటేస్తారా? అన్న చర్చ జోరు గా సాగుతున్నది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చీటికి మాటికి ఆరోపణలు చేస్తూ పబ్బం గడిపిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు రూట్ మార్చింది. అధికారంలోకి రాగానే హామీలను వాయిదాలు వేస్తూ రైతులను మోసం చేస్తున్నది. కష్టాల్లో ఉన్న అన్నదాతను ఆదుకునేందుకు ముందుకు రావడంలేదు. గతంలో చెడగొట్టు వానలు పడితే కేసీఆర్ సర్కారుపై నిందలు వేసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు భారీ కుట్రలు చేశాయి. కేసీఆర్ సర్కారు మాత్రం ఎక్కడా వెనకడుగు వేయకుండా నష్టాలు వచ్చినా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతోనే కొనుగోలు చేసింది. అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఎదురైన తొలి వ్యవసాయ సీజన్లోనే సర్కారు చర్యలు ఈ రకంగా ఉంటే మున్ముందు ఎలా ఉండనున్నదో? అని రైతులు నిట్టూరుస్తున్నారు. కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ధాన్యం సేకరణంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి చేరికలపై ఉన్న ధ్యాస రైతు సమస్యలపై లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నెలన్నర వ్యవధిలో నిజామాబాద్, కామారెడ్డి రైతులపై మూడుసార్లు ప్రకృతి ప్రకోపం చూపింది. ఒకసారి అకాల వాన, మరోసారి వడగండ్లు ఆగం చేశాయి. మొన్నటికి మొన్న ఈదురు గాలులు, వర్షం, వడగండ్లు కలగలిసి బీభత్సం సృష్టించాయి. కోతకు వచ్చిన పంట చేతికి రాకుండానే నేలపాలయ్యింది. కల్లాల్లో నీరు చేరి ధాన్యపు రాశులు తడిసి ముద్దయ్యాయి. వర్షపు నీళ్లలోంచి వడ్ల గింజలను ఏరుకునేందుకు రైతులు పడుతున్న కష్టం చూస్తే గుండె తరుక్కుపోతున్నది. ఈ పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్ మాత్రం రైతులపై ప్రేమ నటిస్తున్నదని తప్ప.. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ యంత్రాంగంతోనైనా రైతులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. కోడ్ ఆటంకంగా మారితే ఈసీ అనుమతితోనైనా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని రైతులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బోధన్, బాల్కొండ నియోజకవర్గాల్లో అకాల వర్షంతో వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తడవడంతో కొనుగోళ్ల ప్రక్రియ నిలిచినట్లు సమాచారం. తేమ శాతం తక్కువ ఉంటేనే ధాన్యాన్ని కొనేందుకు ససేమిరా అంటున్న ప్రభుత్వ సిబ్బంది.. ఇప్పుడు పూర్తిగా తడిసిన వడ్లను సేకరించడం కష్టంగానే కనిపిస్తున్నది. ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే తప్ప ఇది జరిగే పనిలా కనిపించడం లేదు. లేదంటే వ్యాపారులకు సగం ధరకే తడిసిన ధాన్యాన్ని అమ్ముకోవడం ఒక్కటే రైతుకు మిగిలిన అవకాశంగా కనిపిస్తున్నది.