ఉమ్మడి జిల్లాలో కొంతకాలంగా దేశీదారు మద్యం ఏరులైపారుతున్నది. యథేచ్ఛగా విక్రయాలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రకు ఆనుకుని కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలు ఉండడంతో దేశీదారు ప్రభావం ఇక్కడి మద్యం విక్రయాలపై పడుతున్నది. పొరుగు రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున అక్రమ మద్యం డంప్ అవుతున్నది. వక్రమార్గాల్లో వస్తున్న దేశీదారును నియంత్రించడంలో ఎక్సైజ్ శాఖ విఫలమైనట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోటర్ సైకిళ్లపైనే పెద్దఎత్తున దేశీదారు మద్యాన్ని మన రాష్ట్రంలోకి తరలిస్తున్నట్లు సమాచారం. ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నదో తెలిసినప్పటికీ, నియంత్రణ చర్యలు తీసుకోవడంలో సంబంధిత శాఖ నిర్లక్ష్యం వహిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జుక్కల్, బోధన్, నిజామాబాద్ అర్బన్, బాన్సువాడ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పొరుగు రాష్ర్టానికి చెందిన దేశీదారు ఏరులై పారుతున్నది. అడపా దడపా దాడులతో అక్కడక్కడ దేశీదారు పట్టుకుంటున్నప్పటికీ పూర్తి స్థాయిలో నియంత్రణ చేయడంలో ఆబ్కారీ శాఖ ఆపసోపాలు పడుతున్నది. రూ.లక్షల ఫీజులు చెల్లించి మద్యం వ్యాపారం నిర్వహిస్తున్న వారికి దేశీదారు దెబ్బ భారీగానే తగులుతున్నది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని మద్యం వ్యాపారులకు ఈ అక్రమ మద్యం తలపోటును తీసుకు వస్తున్నది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి దేశీదారుతో భారీగానే గండి పడుతున్నది.
– నిజామాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖరీదైన విస్కీలో దేశీదారు.. దేశీదారును ఉమ్మడి జిల్లాకు విచ్చలవిడిగా సరఫరా చేస్తుండడంతో కల్తీ మద్యానికి ఆస్కారం ఏర్పడే వీలు లేకపోలేదు. కొన్నినెల క్రితం నిజామాబాద్ నగరంలోనే భారీ ధరలు కలిగిన విస్కీలో దేశీదారు మద్యాన్ని కలిపి విక్రయించిన ఘటన వెలుగు చూసింది. కొంతమంది మద్యం వ్యాపారుల ధన దాహానికి..ఇలాంటి ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మద్యం విక్రయాల్లో అధిక లాభాల కోసం ఖరీదైన విస్కీలో దేశీదారును కలిపి అమ్ముతున్నట్లు మద్యం ప్రియుల్లోనూ చర్చ నడుస్తున్నది.
చైన్ వైన్ షాపులను నిర్వహిస్తున్న వ్యాపారులే ఈ తరహా ఎత్తుగడలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తరచూ మద్యం బాటిళ్ల తనిఖీలు చేపడితే ఈ కల్తీ అరికట్టే వీలుంది. అడపా దడపా తనిఖీలు చేస్తుండడంతో దేశీదారు మాదిరిగానే కల్తీ కూడా రాజ్యమేలే అవకాశాలు ఏర్పడ్డాయి. బార్ అండ్ రెస్టారెంట్లలో ఎక్కువగా పెగ్గు చొప్పున అమ్మకాలుంటాయి. మద్యం ప్రియులు కాస్లీ విస్కీ ఆర్డర్ చేస్తే మొదటి రెండు పెగ్గులు నాణ్యమైన మద్యాన్ని విక్రయించి నమ్మిస్తారని ఆ తర్వాత ఆర్డర్ ఇచ్చే పెగ్గుల్లో కల్తీ మద్యాన్ని పోసి ఇస్తున్నట్లుగానూ పలుచోట్ల బహిర్గతమైంది.
బార్ అండ్ రెస్టారెంట్లు బడా బాబుల చేతుల్లో ఉండడంతో అటువైపు ఆబ్కారీ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. దీంతో వారి ఆగడాలు మితిమీరుతున్నాయి. దేశీదారు అమ్మకాలకు ఎక్కువగా బెల్టు షాపులు కూడా ఆజ్యం పోస్తున్నాయి. సంబంధిత మద్యం దుకాణానికి చెందిన బాటిళ్లు కాకుండా వేరే రాష్ర్టానికి చెందిన దేశీదారు విచ్చలవిడిగా దొరుకుతున్నదని సమాచారం. ఇప్పటి వరకు ఆబ్కారీ శాఖ చేసిన దాడుల్లో పట్టుబడిన కేసుల్లోనూ బెల్టు షాపులే ఎక్కువగా ఉండడం గమనార్హం. కల్తీ మద్యం, దేశీదారు కట్టడికి బెల్టు షాపులతో పాటు బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాలపైనా కన్ను వేయాలని ఆబ్కారీ శాఖ అధికారులను మద్యం ప్రియులు కోరుతున్నారు.
అధిక లాభాలే కారణం.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దేశీదారు దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతున్నది. తెలంగాణకు చెందిన మద్యం విక్రయిస్తే లాభాలు అంతంత మాత్రమేనని, మహారాష్ట్రలోని చౌక మద్యమైన దేశీదారును అమ్మడానికి ఆసక్తి చూపుతున్నారు. దేశీదారు ఒక్కో పెట్టే ధర రూ.3వేల వరకు లభిస్తున్నది. ఒక్కో పెట్టెలో 48 బాటిళ్లు ఉంటాయి.
ఒక్కో సీసా ధర రూ.56 అయితే వీటిని వంద రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ మేరకు ఒక్కో పెట్టెకు రూ.5వేల వరకు ఆదాయం రాగా ఖర్చులు పోను ఒక్కో పెట్టెపై రూ.2వేల వరకు లాభాలు పొందుతున్నారు. ఆయా గ్రామాల్లో ఈ లెక్కన రోజుకు సుమారుగా పెద్ద ఎత్తున దేశీదారు విక్రయాలు సాగుతున్నట్లు తెలుస్తున్నది. దీంతో తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నది. తెలంగాణ ప్రభుత్వ అనుమతితో విక్రయించాల్సిన మద్యానికి బదులుగా దేశీదారు విక్రయాలు పెరగడంతో సర్కారు ఖజానాకు రావాల్సిన లాభాలు ఆవిరై పోతున్నాయి.
దేశీదారు విక్రయాలు బాహాటంగానే సాగుతున్నా, ఆబ్కారీ అధికారులు ముందస్తు సమాచారం ఇస్తేనే పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారే తప్ప, నేరుగా తనిఖీలు చేసిన దాఖలాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారులు ఇష్టారీతిన అమ్మకాలు కొనసాగిస్తున్నప్పటికీ పోలీస్, ఆబ్కారీ అధికారులు తూతూ మంత్రంగా దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికారుల అండదండలతోనే దేశీదారు వ్యాపారం కొనసాగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ సర్కారు ద్వారా అనుమతులు పొందిన మద్యం దుకాణాదారులే ఈ విషయంపై ఎక్సైజ్ శాఖ తీరును ఎండగడుతున్నారు.