నిజామాబాద్ క్రైం, జనవరి 6: వయస్సుతో నిమిత్తం లేకుండా 60,70,80 సంవత్సరాలు పైబడిన వైద్యులు క్రీడల్లో పాల్గొనడం తనను ఆశ్చర్యపరిచిందని జిల్లా జడ్జి సునీతా కుంచాల అన్నారు. తమ ఆరోగ్యమే కాకుండా ప్రజలు సైతం ఆరోగ్యంగా ఉండడానికి క్రీడలపై అవగాహన కల్పిస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లా కేంద్ర శివారులో ఉన్న నాగారంలోని రాజారాం స్టేడియంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)ఆధ్వర్యంలో శుక్రవారం రన్నింగ్, షాట్పుట్ తదితర పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం చేయాలని సూచించారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ నీలి రాంచందర్,ప్రధాన కార్యదర్శి డాక్టర్ జలగం తిరుపతిరావు, వైద్యులు బండారు సుజాత, విశాల్, హరీశ్ స్వామి, ముత్తన్న, చంద్ర శేఖర్ రెడ్డి, రవీంద్ర నాథ్ సూరి, చంద్రశేఖర్ రావు, వెంకటరమణ,అరవింద్ రెడ్డి, ఆనంద్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, గోవింద్, నరేశ్, మల్లీశ్వరి, ఫరీదా బేగం, శకుంతల తదితరులు పాల్గొన్నారు.