కంటేశ్వర్ : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్నులకే ప్రయోజనమని సీపీఐ( CPI ) జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ (Pashya Padma) ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ కాలనీలో హమాలీ యూనియన్ ఏఐటీయూసీ కార్యాలయంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ( Central budget ) రైతులకు, కార్మికులకు, నిరుపేద ప్రజలకు వ్యతిరేకంగా ఉందని అన్నారు.
రైతులు సుదీర్ఘకాలంగా చేస్తున్న పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేసి అమలుకు నిధులు కేటాయించకపోవడం దారుణమని అన్నారు. రుణమాఫీపై బడ్జెట్ కేటాయింపులు చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. ఆదాయ పన్ను రూ. 12 లక్షల వరకు మినహాయింపు ఇవ్వడం కేవలం 80 నుంచి 85 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. కానీ రెండు కోట్ల 50 లక్షల మంది ధనికులకు, కార్పొరేట్ కంపెనీల యజమానులకు ఉపయోగపడే విధంగా ఉందని విమర్శించారు.
ఆదాయం వచ్చే వారికి లాభం చేకూర్చే విధంగా బడ్జెట్ ఉందని విమర్శించారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ ప్రజల అభివృద్ధి తగ్గట్టుగా బడ్జెట్లో కేటాయింపులు లేవని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులను తగ్గించారని ఆరోపించారు. నిరుపేదల వ్యవసాయ కార్మికుల ఉపాధిని ( Labours Employment ) దెబ్బతీసే విధంగా బడ్జెట్ కేటాయింపులు చేశారని మండిపడ్డారు.
సామాన్య ప్రజల అభివృద్ధికి కేటాయించుతూ బడ్జెట్ ను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, కామారెడ్డి జిల్లా కార్యదర్శి దశరథ్, జిల్లా నాయకులు వై. ఓమయ్య, అడ్డికే రాజేశ్వర్, వై రాజిరెడ్డి, పి.ముత్యాలు , రఘురాం,అంజలి తదితరులు పాల్గొన్నారు.