కంఠేశ్వర్/ఖలీల్‌వాడి, అక్టోబర్ 29: ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న సమగ్ర ఇంటింటి సర్వేనే కుల గణనకు ఆధారమని అందువల్ల బీసీలు పూర్తి సహకారమందించి వివరాలు సమర్పించాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సూచించారు. ఈ సర్వేలో ఆస్తుల వివరాలు తెలుసుకోవడమనేది మీ నుంచి తీసుకెళ్లడం కోసం కాదని, బీసీల స్థితిగతులను తెలుసుకోవడం కోసమేనన్నారు. ప్రజల అభిప్రాయాలు, సూచనలతో పాటు ప్రభుత్వం చేపట్టనున్న సమగ్ర సర్వే సందర్భంగా వెల్లడయ్యే అంశాలను పరిగణనలోకి తీసుకుని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల దామాషాపై సమగ్ర నివేదిక రూపొందిస్తామన్నారు. స్థానిక సంస్థల్లో కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై ప్రజాభిప్రాయాలు సేకరిస్తున్న కమిషన్ మంగళవారం నిజామాబాద్ కలెక్టరేట్లో ప్రజలు, పార్టీలు, కుల సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించింది.
కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ నేతృత్వంలోని సభ్యులు తిరుమలగిరి సురేందర్, రాపోలు జయప్రకాశ్, బాలలక్ష్మితో కూడిన కమిషన్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బహిరంగ విచారణ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి 120 వినతులు, సూచనలు వచ్చాయి. విచారణ అనంతరం కమిషన్ చైర్మన్ నిరంజన్ విలేకరులతో మాట్లాడారు. బీసీ కమిషన్ నిక్కచ్చిగా పని చేస్తుందని, కచ్చితమైన సమాచారమిస్తే బీసీలు హక్కులు సాధించుకోవడానికి సహకరిస్తుందన్నారు. నవంబర్ 13 వరకు ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలను పోస్టల్ ద్వారా కమిషన్‌కు తెలుపవచ్చన్నారు.
బీసీ కమిషన్‌కు భారీగా వినతులు వచ్చాయి. నిజామాబాద్ రూరల్, జుక్కల్ ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, లక్ష్మీకాంతరావు తమ అభిప్రాయాలను కమిషన్ ఎదుట ఉంచారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరగాలని వారు పేర్కొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ప్రతినిధులు రాజకీయ, విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాల్లో బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు, బడ్జెట్ కేటాయించాలని విన్నవించారు. జిల్లాలో బీసీ భవన్ నిర్మించాలని, బీసీ స్టడీ సర్కిల్‌కు రెండెకరాల స్థలం కేటాయించి సొంత భవనం నిర్మించాలని జిల్లా అధ్యక్షుడు కెంపుల నాగరాజు కోరారు. సమగ్ర కులగణన అనంతరం కులాల జనాభా లెక్కలు బహిరంగపర్చాలని కోరగా, బీసీ లెక్కలు తేలేలా సంఘం తరఫున గ్రామ గ్రామాన చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని కమిషన్ చైర్మన్ నిరంజన్ సూచించారు. వివిధ పార్టీలు, బీసీ కుల సంఘాల నుంచి కలిపి మొత్తం 120 వినతులు వచ్చాయి. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, స్పెషల్ ఆఫీసర్ సతీశ్, జిల్లా బీసీ సంక్షేమాధికారిణి స్రవంతి పాల్గొన్నారు.
కంఠేశ్వర్, అక్టోబర్ 29: నగరంలోని బురుడుగల్లీలో సోమవారం రాత్రి పర్యటించిన బీసీ కమిషన్.. మేదరి కులస్తుల జీవన స్థితిగతులను పరిశీలించింది. మేదరుల ఆర్థిక, సామాజిక స్థితిగతులపై కమిషన్ సభ్యులు వారిని అడిగి తెలుసుకున్నారు. వెదురుతో తయారుచేసిన ఉత్పత్తులను పరిశీలించారు. ఇతర రాష్ర్టాల తరహాలో తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని మేదరి కులస్తులు విన్నవించగా, సానుకూలంగా స్పందించిన కమిషన్ ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చింది.