నాగిరెడ్డిపేట, ఆగస్టు 15 : రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని నీటి పారుదల శాఖ సీఈ శ్రీనివాస్ సూచించారు. పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువ గేట్ల నుంచి ఆర్డీవో ప్రభాకర్తో కలిసి గురువారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఈ శ్రీనివాస్ మాట్లాడుతూ పోచారం ప్రాజెక్టులో 16ఫీట్లు, 1.1టీఎంసీ నీరు ఉన్నదని, నాలుగు విడుతల్లో నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల ఆయకట్టు రైతులకు సాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు.
నీరు తక్కువగా ఉండడంతో పొదుపుగా వాడుకోవాలన్నారు. గతేడాది పోచారం ప్రాజెక్టు పొంగి పొర్లడంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 25 టీఎంసీల నీరు చేరిందన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం నాలుగు టీఎంసీల నీరు నిల్వ ఉన్నదని తెలిపారు. చివరి దశలో పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తే కొండపోచమ్మ సాగర్ జలాశయం నుంచి 2.5 టీఎంసీల నీరు వదిలేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నీటి పారుదల శాఖ ఎస్ఈ పద్మావతి, ఈఈ మల్లేశ్, డీఈఈ వెంకటేశ్వర్లు, ఏఈ శ్రీకాంత్, తహసీల్దార్ లక్ష్మణ్, ఎంపీడీవో ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.