ఖలీల్‌వాడి, సెప్టెంబర్ 1: పైకి కాంగ్రెస్ భజన చేస్తున్నప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి, బీజేపీది ఫెవికాల్ బంధమని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు కలను సాకారం చేసే కుతంత్రంలో భాగంగానే కాళేశ్వరంపై విచారణ పేరుతో బురదజల్లి ఇప్పుడు కేసును సీబీఐ చేతిలో పెట్టి రేవంత్ గురుదక్షిణ సమర్పించుకున్నారని ధ్వజమెత్తారు.
కాళేశ్వరాన్ని కనుమరుగు చేసి ఆంధ్రకు నీళ్లు తరలించే ఎజెండా కూ డా ఈ కుట్రలో దాగి ఉన్నదని అనుమానం వ్యక్తంచేశారు. బీజే పీ, కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఈ కుట్రలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పజెప్పడమంటే ఆ ప్రాజెక్టును పూర్తిగా మూసేయడమేనని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నిన్నటిదాకా సీబీఐ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్‌రెడ్డి ఒక్క రోజులోనే మాట ఎం దుకు మార్చాడని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న శక్తులు ఏవో, వాటి ఉద్దేశాలు ఏమిటో ప్రజలకు తెలియజెప్పాలని కోరారు. కాళేశ్వరం కేసును కాం గ్రెస్ పార్టీ సీబీఐకి ఇచ్చినా మరే ఏజెన్సీకి ఇచ్చినా భయపడేది లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను టచ్ చేస్తే రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారుతుందని జీవన్‌రెడ్డి హెచ్చరించారు.