నిజామాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చినోళ్లం.. గులాబీ పార్టీ వాళ్లం. గట్టిగా ప్రజల పక్షాన నిలబడతాం..’ అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక కేసీఆర్ బిడ్డలమైన రామన్న మీద, తన మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, తమది భయపడే బ్లడ్ కాదు. భయపెట్టే బ్లడ్ అంటూ వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా తామెవ్వరికీ భయపడేది లేదని, తాము తప్పు చేయలేదన్నారు.
తన మీద, రామన్న మీదైనా, కావాలంటే బీఆర్ఎస్ నాయకులపైనా ఎన్ని కేసులు పెట్టుకున్నా… నిప్పు కణికల్లా బయటికి వస్తామంటూ స్పష్టం చేశారు. అక్రమ నిర్బంధం అనంతరం నిజామాబాద్ జిల్లాకు తొలిసారి ఆదివారం కవిత వచ్చారు. ఈ సందర్భంగా 44వ నంబర్ జాతీయ రహదారి ఇందల్వాయి టోల్ ప్లాజా దగ్గరి నుంచి నిజామాబాద్ నగరం వరకు కవితకు ఘన స్వాగతం లభించింది. బీఆర్ఎస్ శ్రేణులు, భారత జాగృతి నాయకులు, కవిత అభిమానులు దారి పొడవునా అపూర్వ స్వాగ తం పలికారు.
పలు చోట్ల గజమాలతోనూ కవితను సత్కరించారు. సుభాష్‌నగర్‌లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకుని ఉద్యమ కాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేసి నినదించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మనసుకు ఏది వస్తే అది హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు హామీల అమలులో చేతులు ఎత్తేశారన్నారు. మహిళలందరికీ విన్నవిస్తున్నానని, తులం బంగారం ఏదని కాంగ్రెస్ నేతలను అడగాలని, గల్లీలోకి వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు.
కేంద్రానికి ఎదురించి మాట్లాడితే కేసు, చైనా వాడు బార్డర్ దాటి లోపలికి వచ్చిండంటే కేసు, ప్రజలకు మంచి జరుగతలేదంటే కేసు, ఇక రాష్ట్రంలో చెప్పనే అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి పేరు మరిచి పోతే కేసు, రైతు భూమి ఇయ్యకపోతే కేసు, ఫేసుబుక్కులో పోస్టు పెడి తే కేసు, ట్విట్టర్లో ప్రొఫెసర్లు అభిప్రాయం చెబితే కేసు, ఇన్స్ట్రాలో అక్కాచెల్లెళ్లు వీడి యో పెడితే కేసు అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును కవిత ఎండగట్టారు.
మన సంస్కృతికి నిలువుటద్దమైన తెలంగాణ తల్లి వద్దని, హస్తం గుర్తు కలిగిన కాంగ్రెస్ బొమ్మను సెక్రటేరియేట్‌లో పెట్టారని అన్నారు. బతుకమ్మను పట్టుకున్న తల్లిని వద్దంటున్నాడని, ఒప్పుకుందామా అని ప్రజలను కవిత అడిగారు. మన తెలంగాణ తల్లి మనకు కావాల్నా వద్దా అని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి మాదిరా… కాం గ్రెస్ తల్లి మీదిరా… అంటూ గట్టిగా నినదించగా ప్రజలు సైతం కోరస్ అందుకుని గట్టిగా నినాదాలు చేశారు. మన సంస్కృతి మీద దాడి చేస్తున్న కాంగ్రెస్ సర్కారును ఎదిరిద్దామని పిలుపునిచ్చారు.
ఇటున్న సూర్యుడు అటు ఉదయించినా రాబోయే కాలమంతా గులాబీ శకమేనని కవిత కుండబద్దలు కొట్టి చెప్పారు. ఈ తీర్పును ఎవరూ మార్చలేరన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, రాబోయే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో కచ్చితంగా రాష్ట్రం, జిల్లా అంతటా గులాబీ జెండానే ఎగురబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. రైతుభరోసాను ఎగ్గొట్టారన్నారు. రుణమాఫీ చేసినం అంటున్నారని, మనకు రాలేదని, పక్క ఇంటోడికి రాలేదన్నారు. మరి ఎవరికి వచ్చిందో వారికే తెలుసున్నారు. ఏ ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు రాలేదన్నారు. కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేసి లక్షలాది మందిని చదివిస్తే, గురుకులాలు నడపడం చేతకాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు.
వీరి పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 57 మంది పిల్లలు గురుకులాల్లో చనిపోయారన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే ముగ్గురు పిల్లలు చనిపోయారని తెలిపారు. వీళ్లకు పిల్లలను కూడా చూసుకోరావడంలేదని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారని, ఏడాదికి 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో వచ్చిన నోటిఫికేషన్ ద్వారానే ఈ ఉద్యోగాలిస్తున్నారని తెలిపారు. యువ మిత్రులు పిడికిలి ఎత్తాలని, పిడికిలి ఎత్తి ఏడాదికి 2లక్షల ఉద్యోగాలు అడగాలని సూచించారు. ఉద్యోగస్తులు ఎక్కడికి వెళ్తే అక్కడ తమతో గోడు వెళ్లబోసుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ ఉన్నప్పుడు 40శాతం పీఆర్సీ పెంచారని, సమయానికి డీఏలు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ వచ్చినంక పెండింగ్ డీఏలు మంజూరు చేయడం లేదన్నారు.
లఫంగా మాటలు, హౌలే మాట లు, ఇష్టమొచ్చిన మాటలు మాట్లాడుకుంటూ కాలం గడుపుతున్న చేతకాని దద్దమ్మ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్‌పై నమ్మకం పోయింది. స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడొకడు మాట్లాడుతున్నాడు బీఆర్ఎస్ ఫినిష్ అయ్యిందట. అరే పిచ్చోడా బీఆర్ఎస్ రోజురోజుకూ పెరుగుతున్నది. హామీలు అమలు చేయలేక టీవీల్లో రేవంత్ రెడ్డి కనిపిస్తే ప్రజలు చానళ్లను మార్చేస్తున్నారు. అంతటి అసహ్యించుకునే పరిస్థితి ప్రజల్లో ఏర్పడింది. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ ఖతం అవుతుంది. బీఆర్ఎస్ గెలవడం ఖాయం.
– వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను దోచుకొని ఢిల్లీలో పెడుతున్నది. ఆంధ్రలో రూ. 50లక్షలతో దొరికిన దొంగ రేవంత్‌రెడ్డి. ఆరు గ్యారెంటీలు లేవు. తులం బంగారం లేదు. ఏమన్న అంటే కేసులు పెట్టడం, దౌర్జన్యం చేయడం ఒక్కటే కాంగ్రెస్‌కు తెలుసు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో అడగకున్నా నిధులు ఇచ్చి అభివృద్ధి చేసింది. కానీ ఇక్కడ అడిగినా ఇచ్చేవాడు లేడు. కేటీఆర్‌పై కేసులు, ఈడీ కేసులు పెడుతున్నారు. అంటే కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని తెలుస్తున్నది.
-బాజిరెడ్డి గోవర్ధన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్
ఖలీల్‌వాడి, డిసెంబర్ 29: బీఆర్ఎస్ ఆట మొదలైంది. మోదీ కుళ్లును, ఈడీ జైళ్లను ఢీకొట్టిన ధీశాలి కవిత. ఇప్పుడు కాం గ్రెస్, బీజేపీ వెంట పడుతాం. కాంగ్రెస్వీ కక్ష సాధింపు చర్యలు, బీజేపీవి రాజకీయ బెదిరింపులు. ఈ రెండు పార్టీలు రాక్షస పార్టీలుగా మారాయి. మొక్కవోని ధైర్యం తో ప్రజా క్షేత్రంలో పోరాటం సాగిస్తున్న కవిత తెలంగాణ గడ్డ గర్వపడే యోధురాలు. ఈడీ, ఐటీలను ఎదుర్కొని కడిగిన ముత్యంలాగా ప్రజల ముందుకు వచ్చారు. కేసీఆర్ ఫ్యామిలీ అంటేనే ఫైటర్ ఫ్యామిలీ. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చి తెలంగాణని అంధకారంలోకి నెట్టింది. రాష్ట్రభివృద్ధి, ప్రజా సంక్షేమమే కేసీఆర్ ఆరాటం.
-ఆశన్నగారి జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు
ఎమ్మెల్సీ కవిత కడిగిన ముత్యంలా జిల్లాకు వచ్చా రు. ఆరోగ్యం బాగోలేక బతుకమ్మకు దూరంగా ఉం టే కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మని కనబడకుండా చేసింది. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తారు. జిల్లా అభివృద్ధి కోసం కేసీఆర్‌తో కొట్లాడి రూ. కోట్ల నిధులు తీసుకువచ్చారు. ఆడబిడ్డల కోసం కల్యాణలక్ష్మి తీసుకువస్తే, తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పిండ్రు. ఇప్పుడు తులం బంగారంతోపాటు కల్యాణలక్ష్మీ పోయింది.
-బిగాల గణేశ్‌గుప్తా, అర్బన్ మాజీ ఎమ్మెల్యే
కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు, రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పన్ని ఎన్ని కేసులు పెట్టినా ప్రజలం తా కవితతోనే ఉన్నారు. ఏడాదిలోపు ఇంత త్వరగా ప్రజా ఆదరణ కోల్పోయిందంటే అదీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమే. కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకతపై కవిత ఆధ్వర్యంలో ఉద్యమం నడుస్తుంది. రాజ్యసభలో నలుగురమే ఉన్నా.. కేంద్రంపై బీఆర్ఎస్ యుద్ధం కొనసాగుతుంది.
– కేఆర్ సురేశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు
బతుకమ్మ అంటేనే కవిత, కవిత అంటేనే బతుకమ్మ. అందరికీ ధైర్యం కవిత. ఎంతో మందికి సహాయం చేసిన కవిత కడిగిన ముత్యంలా తిరిగి వచ్చారు. బతుకమ్మకు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రతిష్టలు తీసుకువస్తే దాని ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. సంస్కతి, సంప్రదాయాలను కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడంలేదు. మన బలం, మన బలగం కవితక్క.
-ఆయేషా ఫాతిమా, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు