కోటగిరి, ఆగస్టు 28: అభివృద్ధి, సంక్షేమానికి కేరాఫ్‌గా తెలంగాణ మారిందని, మూడోసారి కూడా కేసీఆర్ ప్రభుత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఎత్తొండ గ్రామంలో రూ.5 కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రెడ్డి కుల సంఘానికి రూ.30లక్షలు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి, సంఘం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు కోటగిరి- ఎత్తొండ మధ్య రూ. కోటీ 60 లక్షలతో నిర్మించిన వంతెనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో సభాపతి పోచారం మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటివరకు 100 కుల సంఘాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. మన రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉందని తెలిపారు. 24గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. గోదావరి జలాలు తీసుకొచ్చి నిజాంసాగర్ ప్రాజెక్టులో నింపుతున్నారని చెప్పారు.
ఇక నుంచి ప్రాజెక్టు ఆయకట్టు కింద పంటల సాగునీటికి ఢోకా లేదన్నారు. రెండు పంటలు వేసుకోవచ్చని భరోసా ఇచ్చారు. పంట పెట్టుబడికి రైతుబంధు పథకం పేరిట ఏడాదికి ఎకరానికి రూ.10 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తుందన్నారు. సహకార సంఘాల ద్వారా ఎరువులు, విత్తనాలు అందిస్తున్నట్లు చెప్పారు. అన్నదాతలు పండించిన పంటకు మద్దతు ధర కల్పించి, కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. పది రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నట్లు చెప్పారు. దివ్యాంగులకు నెలకు పింఛన్ రూ.4,016 పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అని పేర్కొన్నారు. కోటగిరిలో రూ.13 కోట్లతో 50 పడకల దవాఖాన మంజూరవగా.. పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. కేసీఆర్ కిట్, న్యూట్రికిట్ గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, జడ్పీటీసీ శంకర్‌పటేల్, స్థానిక సర్పంచ్ సిరిగిరి సాయిబాబా, వైస్ ఎంపీపీ మర్కెల్ గంగాధర్‌పటేల్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ సిరాజ్, ఏఎంసీ చైర్మన్ మహ్మద్ అబ్దుల్ హమీద్, వైస్ చైర్మన్ రాంరెడ్డి, ఎంపీటీసీ ఫారూఖ్, ఉప సర్పంచ్ సుజాత, బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.