బాన్సువాడ రూరల్ : వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని పల్లె ప్రకృతి వనం, నర్సరీలలో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో బషీరుద్దీన్ (MPDO Basheeruddin ) గ్రామపంచాయతీ కార్యదర్శులు నవీన్ గౌడ్, సృజన్ రెడ్డిలకు సూచించారు. గురువారం మండలంలోని నాగారం, కొల్లూరు గ్రామాల్లో ఎంపీవో సత్యనారాయణ రెడ్డి తో కలిసి పర్యటించారు.
నర్సరీలు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులను ఆయన పరిశీలించారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదును దృష్టిలో పెట్టుకుని నర్సరీలలో మొక్కలకు ప్రతిరోజు నీళ్లు పట్టించాలని ఆదేశించారు. చెత్తాచెదారాన్ని ఎక్కడపడితే అక్కడ పార వేయకుండా డంపింగ్ యార్డ్ లోనే వేయించాలని అన్నారు. వైకుంఠధామాలలో పిచ్చిబోకులను తొలగించి శుభ్రం చేయించాలని సూచించారు.