కామారెడ్డి, ఏప్రిల్ 5 : కారులో మంటలు చెలరేగగా.. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారిపై శనివారం ఉదయం చోటుచేసుకున్నది. దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి నుంచి బడాపహాడ్కు ఆరుగురు కుటుంబ సభ్యులు స్కార్పియో వాహనంలో శుక్రవారం రాత్రి బయల్దేరారు. కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామ శివారువద్దకు రాగానే కారులో నుంచి పొగలు రావడంతో డ్రైవర్ గమనించి వాహనాన్ని పక్కకు నిలిపాడు.
కారులో ఉన్నవారిని అప్రమత్తం చేయడంతో ఆరుగురు వెంటనే దిగిపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆరుగురు సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైనట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.