నాగిరెడ్డిపేట/ఖలీల్వాడి, డిసెంబర్ 12: రెండో విడుత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగిసింది. శుక్రవారం సాయంత్రంతో ప్ర చారానికి తెర పడింది. రెండో విడుతలో భాగంగా ఉమ్మడిజిల్లాలోని 15 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే పీవోలు, సిబ్బందికి శిక్షణ పూర్తి కాగా, ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాల కేటాయింపు కూడా పూర్తయింది. శనివారం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రానికే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. ఆదివారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు ప్రకటించనున్నారు.
రెండు జిల్లాల్లో కలిపి 15 మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని 8 మండలాల పరిధిలో 196 సర్పంచ్, 1,760 వార్డు స్థానాలకు, కామారెడ్డి జిల్లాలోని 8 మండలాల పరిధిలోని 197 సర్పం చ్, 1,654 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. అయితే, నిజామాబాద్ జిల్లాలో 38 సర్పంచ్, 674 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యా యి. మిగిలిన 158 సర్పంచ్ స్థానా ల్లో 568 మంది పోటీలో ఉన్నా రు. ఇక, మొత్తం 1760 వార్డులకు గాను ఐదు చోట్ల నామినేషన్లు దాఖ లు కాలేదు. 674 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1,081 వార్డుల్లో 2,634 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1,476 పోలింగ్ కేంద్రాల్లో 2,38,838 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
రెండో విడత ఎన్నికలకు సంబంధించిన ప్రచార గడువు శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. చివరి రోజు అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేశారు. తమకు కేటాయించిన గుర్తులతో చాలా పల్లెల్లో ర్యాలీలు నిర్వహించారు. ఇన్నాళ్లు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసిన అభ్యర్థులు ఇక ప్రలోభాలకు తెర లేపారు. చాలాచోట్ల మందు, మాంసంతో పాటు నగదు పంపిణీకి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. ఆదివారం జరిగే ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని కోరుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు ఊపందుకున్నట్లు సమాచారం.