కోటగిరి, జనవరి 31: వేసవి కాలం రాకముందే గ్రామాల్లో నీటి కటకట మొదలైంది. పలు పల్లెల్లో తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని రాంపూర్ గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 30 డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి, అర్హులైన పేదలకు పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీటి సౌకర్యం కల్పించారు. క్షేత్రపర్యటనలో భాగంగా ‘నమస్తే తెలంగాణ’ డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని శుక్రవారం సందర్శించగా.. కాలనీవాసులు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గుర్తించింది.
పంచాయతీ ట్యాంకర్ వద్ద నీళ్లు పట్టుకుంటున్న దృశ్యం కనిపించింది. కొన్ని రోజుల నుంచి డబుల్ బెడ్రూం ఇండ్లకు తాగునీటి సరఫరా నిలిచిపోయిందని కాలనీవాసులు తెలిపారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని పలుమార్లు సంబంధిత శాఖ అధికారులను అడిగితే మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలిపోయిందని చెబుతున్నారని వాపోయారు. సింగిల్ ఫేస్ మోటరు ఉన్నప్పటికీ కొద్దిసేపు మాత్రమే నీళ్లు వస్తున్నాయని, అవికూడా నాలుగు ఇండ్లకు కూడా సరిపోతలేవన్నారు. పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టి వెంటనే తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని, కాలనీలో నాలుగు ఇండ్లకు ఒక కుళాయి ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.
రాంపూర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయానికి భగీరథ నీళ్లు అస్తలేవు. నీళ్ల సౌకర్యంలేక నెలకంటే ఎక్కువ రోజులవుతున్నది. పంచాయతీ వాళ్లు వేరే మోటరు నుంచి ట్యాంకర్ నింపుకొచ్చి కాలనీలో పెడుతున్నరు. కానీ ఇక్కడ బిందెలో నీళ్లు తీసుకొని డబుల్ బెడ్ రూంలోని పైన ఇంటిపైకి ఎక్కాలంటే కష్టంగా ఉన్నది.
-నాగం మగెవ్వ, కాలనీవాసి, రాంపూర్, కోటగిరి మండలం
రాంపూర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీలో తాగునీటి సమస్య ఉంది. మా కాలనీలో నల్లాలు ఏర్పాటుచేయాలి. భగీరథ నీళ్లు రాని రోజు మేము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నం. ఇప్పుడైన సార్లూ స్పందించి, మా సమస్యను పరిష్కరించాలి.
– కళావతి, కాలనీవాసి, రాంపూర్, కోటగిరి మండలం
పైప్‌లైన్ పగలడంతో రాంపూర్‌కు భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోయింది. రోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో పైప్‌లైన్ ధ్వంసమైం ది. దీంతో భగీరథ నీరు సరఫరా నిలిచిపోయింది. బోరు మోటరు ద్వారా ట్యాంకర్ నింపి డబుల్ బెడ్రూం ఇండ్లకు సరఫరా చేస్తున్నాం.
– హన్మంతరావు, కార్యదర్శి, రాంపూర్