కామారెడ్డి, జూన్ 19 : ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని విద్యా కమిషన్లు వేసి నివేదికలు సమర్పించినా పాఠశాల విద్యార్థులకు బ్యాగు ల భారం తగ్గడంలేదు. గతంలో విద్యాశాఖ జీవో జారీ చేసినప్పటికీ ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రం ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు. అన్ని నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయి. విద్యార్థుల వయస్సు, తరగతికి మించి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు పుస్తకాల భారం మోపుతున్నాయి. దీంతో పిల్లలపై మానసికంగా, శారీరకంగా తీవ్ర ప్రభావం పడుతున్నది. ఈ భారం తగ్గించేందుకు గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేశాల మేరకు విద్యా శాఖ 2017 జూలై 19న జీవో జారీచేసింది. ఈ జీవోను పకడ్బందీగా అమలు చేయాలని విధి విధానాలనూ కూడా విడుదల చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు సైతం జారీ చేసింది. కానీ ప్రైవేట్ పాఠశాలలు మాత్రం జీవోను అమలు చే యడం లేదు. విద్యను వ్యాపారం చేసి, విద్యార్థులపై బ్యాగుల భారం మోపుతున్నాయి. పాఠశాలల్లోనే పుస్తకాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి.
ఏ తరగతికి స్కూల్ బ్యాగు ఎన్ని కేజీల బరువు ఉండాలని ప్రభుత్వ ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ ఆదేశాలను ప్రైవేట్ పాఠశాలలు బేఖాతరు చేస్తూ వివిధ రకాల మెటీరియల్, సిలబస్‌ల పేరుతో విద్యార్థుల భుజాన మోయలేని భారం మోపుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో అపార్ట్మెంట్లలో విద్యాభ్యాసం కొనసాగడం గమనార్హం. పైకి వెళ్లడానికి విద్యార్థులు పుస్తకాలను మోసుకెళ్లడంతో వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతున్నది. బాల్యంలోనే అనారోగ్యానికి గురికావాల్సి వస్తున్నది. పిల్లలపై బ్యాగులభారం మోపుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖాధికారులు మౌనంగా ఉంటున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లలు పుస్తకాల బరువుతో అలసిపోయి అనారోగ్యం పాలవుతున్నారని, భారం తగ్గించాలని కోరుతున్నారు.
‘ప్రైవేట్’లోనే పుస్తకాల భారం
ప్రైవేట్ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచడానికి విద్యార్థులకు రెగ్యులర్ సిలబస్‌తో పాటు అసైన్మెంట్, ప్రాజెక్ట్‌లు, స్లిప్ టెస్ట్‌లు, క్లాస్ వర్కు, హోం వర్కు, చిత్తు కాపీ, గైడ్, డైరీ, డ్రాయింగ్, క్రాప్ట్, ఆర్ట్, జీకే, కంప్యూటర్ ఇలా ప్రతి సబ్జెక్ట్‌కు 6 నుంచి 7 నోటుపుస్తకాలను కేటాయిస్తున్నారు. దీంతో విద్యార్థులపై మోయలేని భారం పడుతున్నది. ప్రతిరోజు ఆయా సబ్జెక్ట్‌లు చెప్పన్పటికీ విద్యార్థులు అన్ని పుస్తకాలను తీసుకెళ్లాల్సి వస్తున్నది. వాస్తవానికి విద్యార్థి బరువులో బ్యాగు బరువు 10 శాతం మించకూడదు. అంటే 30 కిలోలు ఉన్న విద్యార్థికి 3 కిలోల బరువుకు సమానంగా బ్యాగు బరువు ఉండాలి. కానీ ఒకటో తరగతి చదివే విద్యార్థి శరీర బరువు 15 కేజీలు ఉంటే, పుస్తకాలు 1.5 కిలోలకు బదులుగా 5 కిలోల బరువు ఉంటుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి 35 నుంచి 40 కిలోలు ఉంటే అతడి పుస్తకాల బరువు దాదాపు 3 నుంచి 4 కిలోలకు బదులుగా 12 కిలోలు దాటుతున్నది. దీనికి కారణం తమ పాఠశాలలోనే పుస్తకాలనే కొనాలనే నిబంధనలు ప్రైవేట్ స్కూళ్లు అమలు చేయడంతో పుస్తకాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అంటే శరీర బరువు కన్నా 30 నుంచి 40 శాతం ఎక్కువగా ఉండడంతో విద్యార్థుల వెన్ను విరుగుతున్నది. స్కూల్ బ్యాగు బరువు అధికంగా ఉండడంతో ఎముకలు, కండరాలు, ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అలాగే మెడ, భుజాలు, వెన్నముక వంగిపోతున్నాయి. దీంతో చిన్నప్పటి నుంచే వారు వెన్నునొప్పితో బాధపడుతున్నారు.అధిక ధరకు పుస్తకాలు అమ్మిన వారిపై చర్యలు తీసుకుంటాం
ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు అధిక ధరలకు పుస్తకాలు అమ్మితే చర్యలు తీసుకుంటాం.గతంలోనే విద్యార్థులపై భారం వేయొద్దని సూచనలు కూడా చేశాం. ఏ తరగతి విద్యార్థికి ఎంత బరువు పుస్తకాలు ఉండాలో సూచించాం. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం.
-మల్లికార్జున్, డీఈవో, కామారెడ్డి పిల్లల ఎదుగుదలపై ప్రభావం పడుతుంది
విద్యార్థులు అధిక బరువు మోయడంతో మానసికంగా, శారీరకంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. ముఖ్యంగా మెడ, వీపు, నడుముపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చిన్నారుల ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. నిబంధనలకు లోబడి బరువు ఉండేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి.
-డాక్టర్ శ్రీనివాస్, పిల్లల వైద్య నిపుణుడు