ఖలీల్వాడీ : రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ పీడీఎస్యూ (PDSU) ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ యూనివర్సిటీలో బడ్జెట్( Budget) పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ నాయకులు ప్రిన్స్ మాట్లాడుతూ విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించడం సరైనది కాదని ఆరోపించారు.
బడ్జెట్ను సవరించి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి కేవలం 23,108 కోట్లు మాత్రమే కేటాయించడం సిగ్గుచేటని విమర్శించారు. . మొత్తం 3,04,965 కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో ఇది కేవలం 7.57 శాతం నిధులు మాత్రమేనని ఆరోపించారు. విద్యారంగానికి బడ్జెట్ లో 20 శాతం నిధులు కేటాయించాలని కోరారు.
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను చూస్తే రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) సర్కార్ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని స్పష్టంగా అర్థమవుతుందని వెల్లడించారు. ఇప్పటికే దాదాపు 8వేల కోట్ల ఫీజు రియింబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కనీస సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.
తెలంగాణ యూనివర్సిటీకి రెండు వందల కోట్లు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ పీడీఎస్ నాయకులు రవీందర్, మోహిత్, హుస్సేన్, రాహుల్, భీమ్, ఆకాష్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.