ఎల్లారెడ్డి/నిజాంసాగర్/బాన్సువాడ/బాన్సువాడ రూరల్, ఫిబ్రవరి 7: అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ప్రజల్ని వంచించిన కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ ఎలక్షన్లలో బొంద పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసగించిన రేవంత్‌రెడ్డికి దిమ్మతిరిగేలా తీర్పునివ్వాలని కోరారు. బాన్సువాడ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పోచారం శ్రీనివాసరెడ్డి రేవంత్‌రెడ్డి సంకలో దూరారని మండిపడ్డారు.
ఆయనకు రోశం, పౌరుషం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ శనివారం బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి పట్టణాల్లో పర్యటించారు. మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ షిండే, జాజాల సురేందర్‌లతో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Ktr
వంచించిన కాంగ్రెస్..
అసంబద్ధ హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను తీవ్రంగా వంచించిందని కేటీఆర్ మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. ఫ్రీ బస్సు పథకం ఒక్కటే అమలు చేస్తున్నారన్న కేటీఆర్.. మహిళలు అది కూడా వద్దనే పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. ఆడబిడ్డ పెండ్లికి రూ.లక్ష చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామన్న రేవంత్‌రెడ్డి ఎంత మందికి ఇచ్చాడని ప్రశ్నించగా, అక్కడున్న మహిళలు ఎవరికీ ఇవ్వలేదని చేతులు ఊపారు. రైతుబంధు, రుణమాఫీ, పింఛన్ల పెంపు.. ఇలా ఎన్నో హామీలు అమలు చేయలేదన్నారు. ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తామన్న రేవంత్‌రెడ్డి.. ఒక్కో ఆడబిడ్డకు రూ.లక్ష చొప్పున బాకీ ఉన్నాడన్నారు. కాంగ్రెస్ నేతలు ఓటు కోసం వస్తే.. బాకీ పడ్డ రూ.లక్ష ఇస్తేనే ఓటు వేస్తామని చెప్పాలని మహిళలకు సూచించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తే ఆ పార్టీకి ఓటువేయాలని, అమలు చేయకపోతే బీఆర్ఎస్కు ఓటు వేయాలన్నారు.
కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే..
బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని, రెండూ కలిసి బీఆర్ఎస్ను తొక్కడానికి పని చేస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. మీరెన్ని కుట్రలు చేసినా తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఢిల్లీలో చౌకీదారు అంటూ మోడీని రాహుల్‌గాంధీ విమర్శిస్తే, అ రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీని బడేభాయ్ అని కితాబు ఇస్తాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలను నమ్మి మోసపోవద్దని కోరారు. కేసీఆర్ కులమతాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. నిజమైన సెక్యూలర్ పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు.

Ktr
ఎల్లారెడ్డి ఇజ్జత్ తీసిన మదన్మోహన్
రూ.100 కోట్లు కావాలని ప్రపంచ బ్యాంక్ కు లేఖ రాసి ఎమ్మెల్యే మదన్మోహన్ ఎల్లారెడ్డి ఇజ్జత్ తీశాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అమెరికాలో చదువుకున్న మదన్మోహన్ ఇక్కడ ముఖ్యమంత్రి నిధులు ఇస్తలేడని చెప్పి ప్రపంచ బ్యాంక్‌కు ఉత్తరం రాసిండు. దానికి ప్రపంచ బ్యాంక్ బదులిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరం రాస్తే నిధులు ఇస్తామని, ఇది కూడా మీకు తెలియదా? అని తిరుగు ఉత్తరం రాసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తానని మదన్మోహన్ 30 నవంబర్ 2023 నాడు ప్రజలకు బాండ్ పేపర్ రాసిచ్చాడు. వాటిని అమలు చేశాడా? అని ప్రశ్నించారు. జెమ్స్బాండ్లాగా బాండ్ పేపర్ రాసిన మదన్మోహన్ ఓట్ల కోసం వస్తే హామీలపై ప్రశ్నించాలని సూచించారు. ఓటు కోసం వచ్చే ఎమ్మెల్యేను ఉతికి ఆరేయాలని కోరారు. ఇప్పటికే రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిన కాంగ్రెస్ నాయకులు ఏ ముఖం పెట్టుకొని మీ ఇంటికి వస్తారని ప్రశ్నించారు. ఆటోకు నాలుగు రూపాయలిస్తే అప్పుడు యూరియా బస్తా ఇంటికి వచ్చేది.. ఇప్పుడు యూరియా బస్తా కోసం ఎంత కష్టం అవుతుందో తెలస్తుంది కదా..? ఇదేనా కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని కేటీఆర్ అడిగారు.
పోచారంపై నిప్పులు..
బీఆర్ఎస్ పాలనలో రూ.వేలాది కోట్లను మంజూరు చేసి బాన్సువాడను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌దేనని కేటీఆర్ తెలిపారు. బాన్సువాడకు పోచారం చేసిందేమీ లేదన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డికి ఐదేండ్లు మంత్రిగా, మరో ఐదేండ్లు స్పీకర్‌గా ఉన్నత పదవులు ఇస్తే, కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ను వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు. తిమ్మాపూర్ వేంకటేశ్వర స్వామి సాక్షిగా చనిపోయే వరకు కేసీఆర్ వెంటే ఉంటానని, తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదని గతంలో పోచారం మాట్లాడిన వీడియోను కేటీఆర్ ఈ సందర్భంగా ప్రదర్శించారు.
గతంలో రేవంత్‌రెడ్డి పోచారంను, ఆయన కుమారులను అచ్చోసిన ఆంబోతులని, ఇసుక, కంకరను దోచుకుంటున్నారని అనరాని మాటలు అన్నారని, అయినా పోచారం తన స్వలాభం కోసం నానా బూతులు తిట్టిన రేవంత్ సంకలో చేరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ఏ పార్టీలో ఉన్నారో పోచారం బాన్సువాడ ప్రజలకు జవాబు చెప్పాలని అన్నారు. కాంగ్రెస్‌లో చేరిన పోచారం రెండేండ్లలో బాన్సువాడకు ఎన్ని నిధులు తెచ్చాడోచెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ విచారణలో తాను బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ పోచారం జవాబు ఇవ్వడం సిగ్గుచేటని విమర్శించారు. ఏ ముఖం పెట్టుకొని మీరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలువాలని సవాలు విసిరారు.
బిచ్కుందలో బీఆర్ఎస్ జెండా ఎగరాలి..
కాంగ్రెస్ పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి, ఆ పార్టీకి ఓట్లేస్తే కష్టాలు తప్పవని కేటీఆర్ అన్నారు. దండం పెట్టి చెబుతున్నా.. దయచేసి ఆలోచించండి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించడం ద్వారా.. మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఇదే మంచి అవకాశం వచ్చిందని తెలిపారు. బిచ్కుందలో 30 పడకల దవాఖాన నిర్మాణంతో పాటు కమ్మరి చెరువును మినీ ట్యాంకుబండ్‌గా మార్చిన ఘనత బీఆర్ఎస్దేనని చెప్పారు. బిచ్కుందలో సెంట్రల్ లైటింగ్ పనులు మంజూరు చేసిన ఘనత తమేదనన్నారు.
నిజాంసాగర్ మండలంలో రూ.500 కోట్లతో నాగమడుగు మత్తడికి శ్రీకారం చుట్టామని గుర్తు చేసిన కేటీఆర్.. 20 శాతం పనులు చేసిన గుత్తేదారు మధ్యలోనే నిలిపివేసి వెళ్లిపోయాడని తెలిపారు. 1100 ఓట్ల స్వల్ప తేడాతో హన్మంత్ షిండే ఓడిపోయినప్పటికీ, జుక్కల్‌కు శాశ్వత ఎమ్మెల్యే ఆయనే అని అన్నారు. బిచ్కుంద మునిసిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తే గోపన్‌పల్లి, దౌల్తాపూర్, కందర్పల్లి గ్రామాలను జీపీలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు జనార్దన్‌గౌడ్, జడ్పీ మాజీ చైర్మన్లు దఫేదార్ రాజు, విఠల్‌రావు, నేతలు గిర్దావర్ గంగారెడ్డి, దుద్దాల అంజిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, నార్ల రత్నకుమార్, యెలమంచలి శ్రీనివాస్, తానాజీరావ్ పాల్గొన్నారు.