నిజామాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కును కాపాడేందుకు బీఆర్ఎస్ తరపున ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఓట్ల జాబితా సవరణ కోసం త్వరలో ఎన్నికల కమిషన్ నిర్వహించనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమానికి సంబంధించిన విషయంలో లక్షలాది మంది తెలంగాణ ఎన్ఆర్ఐల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నదని కేటీఆర్ అన్నారు. ఈ విషయంలో గల్ఫ్ బాట పట్టిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కులు తొలగించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలువనున్నట్లు ఆయన వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నివాసంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీలతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. వందలాది మంది ఎన్ఆర్ఐలు తమ స్థానిక శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యులకు ఫోన్లు చేసి ఆందోళన చెందుతున్న విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన రామన్న.. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి తెలంగాణ ఎన్నారైల ఓటు హక్కును కాపాడేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నేతలతో ఒక బృందాన్ని ఢిల్లీకి పంపనున్నట్లు వెల్లడించారు. పోలింగ్ బూత్ పరిధిలో గల్ఫ్ ఎన్ఆర్ఐల వివరాలు సేకరించి, వారి ఓటు హక్కును ఎన్నికల కమిషన్ తొలగించకుండా సమన్వయం చేసుకోవాలని సూచించారు.
పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే జిల్లా పరిషత్ పీఠాన్ని గెలుచుకుని భారత రాష్ట్ర సమితికి ఆది నుంచి నిజామాబాద్ జిల్లా ఒక బలమైన కోటగా నిలిచిందని కేటీఆర్ గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక అవకాశంగా తీసుకుని ముందుకు పోవాలని సూచించారు. కేసీఆర్ సూచించినట్లు సభ్యత్వ నమోదును పకడ్బందీగా నిర్వహించాలని, దీంతో పాటుగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై అప్రమత్తంగా ఉంటూ ఏ ఒక్క పౌరుడి ఓటు హక్కు తొలగించకుండా చూడాలని చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నేతలంతా తమ స్థానిక నియోజకవర్గాల్లో ఉన్న స్థితిగతులపై కేటీఆర్‌కి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల అనేక వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. తిరిగి కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా కేటీఆర్‌తో ఉమ్మడి జిల్లా నేతలంతా చెప్పారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, రానున్న ఎన్నికల నాటికి తిరిగి జిల్లాలో భారత రాష్ట్ర సమితి క్లీన్ స్వీప్ చేసేలా అన్ని విధాలుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జీవన్‌రెడ్డి, బిగాల గణేశ్‌గుప్తా, జాజాల సురేందర్, షకీల్ సతీమణి అయేషా ఫాతిమా, ముజీబుద్దీన్ పాల్గొన్నారు.